
సాక్షి, హైదరాబాద్: ఉర్దూ అధికారుల గ్రేడ్–2 పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల రోస్టర్‌ను ప్రకటించకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా రోస్టర్ ప్రకటించకపోవడం తగదని అభిప్రాయపడింది. ఇప్పటికే గ్రేడ్–2 పోస్టుల ఫలితాలు వెలువడినందున ఎంపికైన వారిని ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు పిటిషనర్‌ను ఆదేశించారు.
తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధీనంలోని ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మార్చి 28న గ్రేడ్–1, గ్రేడ్–2లకు చెందిన 60 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయకుండానే భర్తీ ప్రకటన చేశారని, ఇది సర్వీస్ నిబంధనల్లోని 22కు విరుద్ధమంటూ మహ్మద్ ముత్తాబి అలీఖాన్‌తోపాటుగా మరోవ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి విచారించారు. నేరుగా ఉర్దూ అకాడమీ ఉద్యోగ భర్తీ ప్రకటన జారీ చేయడం చెల్లదని, ఉద్యోగ నియామక నిబంధనల్లోని 22వ సర్వీస్ రూల్ ప్రకారం రోస్టర్ విధానాన్ని అమలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనల అనంతరం హైకోర్టు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.