ఎన్‌టీవీ ప్రసార నిషేధ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
ఎన్‌టీవీ చానెల్ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు 4 వారాల పాటు నిలుపుదల చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎన్‌టీవీ చానెల్ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు 4 వారాల పాటు నిలుపుదల చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఎన్‌టీవీలో రాత్రి 11.30 గంటలకు ‘సినీ కలర్స్’ పేరుతో ప్రసారమైన కార్యక్రమంలో అశ్లీలత ఉందని పేర్కొంటూ ఎన్‌టీవీ ప్రసారాలపై వారం పాటు నిషేధం విధిస్తూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఎన్‌టీవీ యాజమాన్యం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ బుధవారం విచారించారు.


