యవ్వనంగా కనిపించేందుకు హార్మోన్‌ ఇంజెక్షన్లా?

High Court Serious About Using Hormone Injections Over Yadadri Sex Racket Case - Sakshi

యాదాద్రి వ్యభిచారం కేసు విచారణలో హైకోర్టు

తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన వ్యవహారంపై  హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్వీ భట్‌ల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. చిన్నారులు యవ్వనంగా కనిపించేందుకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఉపయోగించడం ఏంటని మండిపడింది.

యాదాద్రి డీసీపీ రామచంద్రా రెడ్డి, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులు స్వయంగా కోర్టుకు హాజరై కేసు వివరాలను తెలియజేశారు. వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న 30 మందిపై కేసులు పెట్టామని, 27 మందిపై పీడీ యాక్ట్‌లు పెట్టి జైలుకు కూడా పంపిచామని తెలిపారు. రెస్క్యూ చేసిన చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణకోసం షీటీమ్‌లు ఏర్పాటు చేసామని, వ్యభిచార గృహాలు, నిర్వాహకులపై నిఘా పెట్టామని అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా బ్రాయిలర్‌ కోళ్లకు ఇచ్చినట్లు ఆడపిల్లలకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇవ్వడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై ఆక్సోటోసిన్‌ ఇంజక్షన్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలపై వివరణ ఇవ్వాలని కోరడంతో ఉస్మానియా వైద్య బృందం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చింది. దీంతో చిన్నారులకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు వారికి సూచించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం దాఖలు చేసుకున్న వారి వివరాలను సైతం తెలుపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top