కార్బైడ్‌ నివారణ చర్యలు చెప్పండి

High Court order to the state government for Carbide prevention - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టి పండ్లుగా చేసి విక్రయించే వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని, ప్రజల ప్రాణాలతో ఆడుకునే అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాల్షియం కార్బైడ్‌ ద్వారా కాయల్ని కృత్రిమ పద్ధతిలో మట్టి పండ్లుగా చేయడంపై 2015లో పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు గతంలోనే ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరిపింది. ఈ ‘పిల్‌’లో పలు వివరాలు కోరుతూ ఇటీవల ధర్మాసనం ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.

కార్బైడ్‌ వినియోగించిన ఎంతమంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారో, ఎంతమందికి శిక్షలు పడ్డాయో, విచారణలో ఎన్ని కేసులు ఉన్నాయో, కేసుల్లో శిక్ష పడకుండా ఎంతమంది బయటపడ్డారో వంటి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రతా చర్యలు తీసుకునేందుకు ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు, గెజిటెడ్‌ ఆఫీసర్లు ఎంతమంది కావాలి, ఇప్పుడు ఆ పోస్టుల్లో ఎంతమంది ఉన్నారు, మిగిలిన పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారు వంటి వివరాలను కౌంటర్‌ ద్వారా తెలియజేయాలంది.

ఆహార భద్రతాధికారుల పోస్టులు 80 అవసరమైతే ఇప్పటి వరకూ వాటిని ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించింది. 256 కేసులు నమోదు చేస్తే కేవలం 19 మందికే శిక్షలు పడ్డాయంటే మిగిలిన కేసులు పరిస్థితి ఏమిటని నిలదీసింది. 2018 ఆగస్టు తర్వాత కార్బైడ్‌ వినియోగం చేయడం లేదని, ప్రమాదకరం కాని మరో రెండు రకాల రసాయనాలతో కాయల్ని మగ్గబెడుతున్నారని ప్రభుత్వం చెప్పడం కాదని మండిపడింది.

రాష్ట్రంలో ఇథిలిన్‌ చాంబర్లు 74 ఏర్పాటు చేశామంటున్నారేగానీ అవి సిద్ధంగా ఉన్నాయో లేదో ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించింది. మరో 36 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తామన్నారు. జిల్లాల వారీగా కేసుల స్థితిగతులను తెలియజేస్తామన్నారు. అందుకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top