ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా? 

High Court comment on the style of outsourcing agencies - Sakshi

ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల వ్యవహార శైలిపై హైకోర్టు వ్యాఖ్య

ఎటు చూసినా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే.. ఆఖరికి హైకోర్టులోనూ..

అయినా వారి బాగోగులు పట్టించుకునేందుకు ఎవరూ లేరు

వీరి సంక్షేమంకోసం ఏం చేయొచ్చో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలపాలి

అలాగే కేంద్రం ఓ విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరముంది

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇప్పుడు ఎక్కడ చూసినా ఔట్‌సోర్సింగే. ఆఖరికి హైకోర్టులో కూడా. శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయకుండా ఇలా ప్రతీ శాఖలోనూ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిని అనుసరిస్తూ పోతుంటే సగం పాలన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. అవసరాన్ని బట్టి ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగులను నియమించుకోవడం బాగానే ఉంది. మరి ఆ ఉద్యోగుల బాగోగులు, చట్ట నిబంధనల ప్రకారం వారికి దక్కాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల సంగతేంటి.. వారిని ప్రశ్నించే వారెవరు.. ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు తీసుకుని, ఔట్‌సోర్స్‌ ఉద్యోగులకు చాలీచాలని జీతాలిస్తుంటే నిలదీసే వారెవరు.. గొప్పగొప్ప కార్మిక నేతలంతా కన్నుమూశారు. ఔట్‌సోర్స్‌ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీల వ్యవహారశైలిని చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. అన్న అనుమానం కలుగుతోంది..’ 

హైకోర్టు ధర్మాసనం 
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల హక్కులు, వారికి చట్ట ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలు తదితర విషయాలపై పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సిన అవసరముందని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందంది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రప్రభుత్వ వైఖరి కూడా తెలుసుకుంటామని, అందువల్ల ఈ వ్యాజ్యంలో కేంద్ర కార్మికశాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏమేమి చేయొచ్చో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని, కనీస వేతనాలు, సెలవులు ఇవ్వడం లేదని, అలాగే పెద్ద ఎత్తున ఆ ఏజెన్సీలు ఆదాయ పన్ను ఎగవేస్తున్నాయని, వీటన్నింటిపై విచారణ జరిపి, తప్పు చేసిన ఏజెన్సీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర టూరిజం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఇది చాలా విస్తృతమైన అంశమని తెలిపింది. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేదంది. 

ఏజెన్సీలు చేతులెత్తేస్తే పరిస్థితేంటి? 
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. అన్న సందేహం కలుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఔట్‌సోర్సింగ్‌ ఇప్పుడు ఓ పెద్ద వ్యాపారంగా మారిపోయిందని, ఉద్యోగులను సరఫరా చేసినందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, అందులో నామమాత్రపు మొత్తాన్ని ఆ ఉద్యోగులకు ఇస్తున్నారంది. ఆస్పత్రి, ప్రభుత్వ కార్యాలయం, హైకోర్టు.. ఇలా ఎక్కడ చూసినా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే కనిపిస్తున్నారంది. వీరికి జీతాలు చెల్లించకుండా ఏజెన్సీలు చేతులెత్తేస్తే పరిస్థితి ఏమిటనే దానిపై ఎవ్వరూ ఆలోచన చేయడం లేదని తెలిపింది. ఇటువంటి వాటి గురించి ప్రశ్నించేందుకు గతంలో గొప్ప గొప్ప కార్మిక నేతలు ఉండేవారని, వారిలో ఇప్పుడు ఎవరూలేరంది. 

నిచ్చెనలుండవు.. కోరలు చాచిన పాములే
‘వైకుంఠపాళి ఆటలోలాగా ఈ ఔట్‌సోర్స్‌ ఉద్యోగులు నిచ్చెన ఎక్కాలని చూస్తుంటారు. కానీ ఏజెన్సీలు పాముల్లా మింగేసేందుకు కాచుకుని ఉంటాయి. వాస్తవానికి ఈ ఔట్‌సోర్స్‌ వైకుంఠపాళిలో నిచ్చెనలు అసలే ఉండవు. కోరలు చాచిన పాములు తప్ప..’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఔట్‌సోర్స్‌ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న చట్ట ఉల్లంఘనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వీరి సంక్షేమం కోసం ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top