ఆదిలాబాద్‌ అతలాకుతలం 

Heavy rain lashes Joint Adilabad district - Sakshi

  ఉమ్మడి జిల్లాలో కుండపోత వర్షం  

  వందలాది గ్రామాలు జలదిగ్బంధం 

  స్తంభించిన రవాణా వ్యవస్థ  

  లక్షలాది ఎకరాల్లో పంట నష్టం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అతలాకుతలమైంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సుమారు 2లక్షల ఎకరాల్లో పత్తి, సోయాబీన్‌ పంట, వరి పంటలు నీట మునిగాయి. ఇచ్చోడలో 26.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. పంట చేలల్లోకి భారీగా వరదనీరు చేరింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాలోనే లక్షా 20 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తాంసి మండల కేంద్రంలో 12 ఇళ్లు నేలకూలాయి. జిల్లా అంతటా వందలాది ఇళ్లు కూలిపోయాయి. జైనథ్‌ మండలం తరోడ వద్ద అంతర్రాష్ట్ర రహదారి వరద కారణంగా కొట్టుకుపోయింది. బ్రిడ్జి నుంచి రోడ్డు ప్రారంభమయ్యే చోట పూర్తిగా కోసుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ బ్రిడ్జి నిర్మించిన తర్వాత 20 ఏళ్లలో ఇంతటి ప్రవాహం ఇదే మొదటిసారి. సరిహద్దులో పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్‌గంగ బ్యాక్‌వాటర్‌ కారణంగా జైనథ్, బేల, తాంసి మండలాల్లో పంట చేలు నీట మునిగాయి. బోథ్‌ మండలం కండ్రివాగు వంతెన పైనుంచి వరదనీరు పోటెత్తడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంటాల జలపాతం పూర్తిగా బండరాళ్లు కనిపించనంతగా వరద నీరు ప్రవహించింది. పొచ్చెర జలపాతంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆయా మండలాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాత్నాల ప్రాజెక్టుకు 45వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నాలుగు గేట్లను ఎత్తి వరద నీటిని వదిలారు. మత్తడివాగు ప్రాజెక్టుకు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఐదు గేట్లను ఎత్తి నీటిని వదిలారు. 

పీహెచ్‌సీలో చిక్కుకున్న గర్భిణులు, బాలింతలు 
ఇచ్చోడలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వరద నీరు చేరడంతో పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఎనిమిది మంది గర్భిణులు, బాలింతలను బయటకు తీసుకొచ్చేందుకు ఇబ్బంది ఎదురైంది. పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో అందరిని బయటకు తీసుకొచ్చారు.  

మావల, గుడిహత్నూర్‌ మండలాలకు సరిహద్దులో ఉన్న వైజాపూర్‌ గ్రామం వద్ద విధులకు వెళ్తున్న టీచర్లు పయనిస్తున్న కారు వరద ప్రవాహంలో చిక్కుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ టీచర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వరద నీటిలో కొట్టుకుపోయిన కారు ధ్వంసమైనప్పటికీ దానిని బయటకు తీసుకొచ్చారు. 

కుమురంభీం జిల్లాలో.. 
కుమురం భీం జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 21.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్‌ మండలం తుంపెల్లి వాగు పొంగిపొర్లడంతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోవడంతో చిర్రకుంట, తిర్యాణి మండలం కైరిగూడ, పంగిడిమాదర, లింగాపూర్‌ మండలాల ప్రజలు ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది.  

వంతెన వద్ద ప్రసవ వేదన 
కుమురం భీం జిల్లా దహెగాం మండలంలోని గెర్రె–గిరవెల్లి గ్రామాల మధ్య ఉన్న ఎర్రవాగు ఉప్పొంగడంతో అవతలి వైపు ఉన్న 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గిరవెల్లి గ్రామానికి చెందిన గర్భిణి ఎల్కరి సుజాతకు గురువారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. దహెగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాలంటే మధ్యలో ఎర్రవాగు ఉండగా, హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. వాగులో దాటే పరిస్థితి లేకపోవడంతో వంతెనకు రెండు వైపులా నిచ్చెనలు వేసి ఆమెను మంచానికి తాళ్లు కట్టి కూర్చోపెట్టి గ్రామస్తులు బ్రిడ్జి దాటించారు.  

నిర్మల్, మంచిర్యాల జిల్లాలో.. 
నిర్మల్‌ జిల్లాలోని మూడు ప్రధాన ప్రాజెక్టులైన కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో ఉండటంతో గేట్లు ఎత్తివేసి నీళ్లు దిగువకు వదులుతున్నారు. జన్నారం మండలంలో అప్రోచ్‌రోడ్డు తెగిపోవడంతో మంచిర్యాల నుంచి నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహనాలను కలమడుగు, ధర్మపురి, రాయపట్నం మీదుగా మళ్లించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top