వడదెబ్బకు గురువారం ఒక్కరోజే తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన పలువురు మృతిచెందారు. వివరాల ప్రకారం..
వడదెబ్బకు గురువారం ఒక్కరోజే తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన పలువురు మృతిచెందారు. వివరాల ప్రకారం..
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం కొప్పునూర్ గ్రామానికి చెందిన దేవని నర్సింహ(50) అనే వ్యక్తి బుధవారం కూలి పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. రాత్రి నిద్రపోయిన చోటే చనిపోయాడు. అలాగే దేవరకద్ర మండలం రేకులంపల్లిలోని వాకిటి కృష్ణయ్య (60) అనే రైతు గురువారం ఉదయం నుంచి పొలం పనులు చేసి సాయంత్రం వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచాడు. అదేవిధంగా కొత్తూరు మండలం గూడూరు గ్రామానికి చెందిన చాకలి జంగయ్య(69) వడదెబ్బతో గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పిట్లాం మండలం బర్నాపూర్ గ్రామంలో అల్లిగిరి రాములు(65) అనే వ్యక్తి గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడికి భార్య పోచమ్మ, ముగ్గురు కుమార్తెలున్నట్లు సమాచారం.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో దస్తగిరిపేట్‌కు చెందిన బుడగజంగం నర్సమ్మ(48) కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె గ్రామంలో పనికి వెళ్లింది. తీవ్రమైన ఎండ కారణంతో వడదెబ్బకు గురైన ఆమె రాత్రి సమయంలో తలనొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వెంటనే నర్సమ్మను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా అప్పటికే మృతిచెందింది. నర్సమ్మకు భర్త కుసులయ్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు.
అలాగే కీసర మండల పరిధిలోని చీర్యాల గ్రామంలో ఆంజనేయులు గౌడ్(49) స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం పనులకు వెళ్లిన ఆయన వడదెబ్బకు గురై అదే రోజు సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గురువారం ఉదయం కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కుటంబీకులు ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య పద్మమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.