భారత్‌కు పెట్రోల్, గ్యాస్‌ అమ్మేందుకు సిద్ధం

Hassan Rouhani Calls For Unity Among Muslims - Sakshi

చారిత్రక మక్కా మసీదులో ఇరాన్‌ అధ్యక్షుడు రౌహనీ ప్రార్థనలు.. ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశానికి పెట్రోల్, గ్యాస్‌ విక్రయించడానికి ఇరాన్‌ సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ ప్రకటించారు. తమ దేశంలో చబహార్‌ ఓడరేవు ప్రారంభమైందని, దీని వల్ల భారత్‌కు రవాణా మార్గం దగ్గర అవుతుందని పేర్కొన్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన రౌహనీ శుక్రవారం చారిత్రక మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్‌ ప్రజల తరఫున హైదరాబాద్‌ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా నంటూ రౌహనీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఐక్యత లేకపోవడం వల్లే..
ఇస్లామిక్‌ దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించే సాహసం చేసిందని రౌహనీ విమర్శించారు. ముస్లింల మొదటి కిబ్లా(నమాజ్‌ చేసే వైపు) ఇప్పుడు ఇజ్రాయెల్‌ అధీనంలో ఉండటానికి ఇస్లామిక్‌ దేశాల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమన్నారు. ఇస్లామిక్‌ దేశాల మధ్య ఐక్యత లేనందున అమాయక పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంద న్నారు. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికాలో మానవత్వం మంటగలుస్తోందని, అమెరికాలోని విద్యాలయాలు, వ్యాపార సంస్థల్లో అమాయకులపై దాడులు సర్వసాధారణం అయ్యాయన్నారు. ఇస్లామిక్‌ దేశాలు తమ వ్యక్తిగత విశ్వాసాలు, నమ్మకాలను పక్కన పెట్టి ఇస్లాం ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలు ముస్లింలను ఉగ్రవాదులుగా చూస్తున్నాయని ఇది సరికాదన్నారు. ముస్లింలు ఇస్లాం ధర్మాన్ని పాటించే వారని, ఇస్లాం వైషమ్యాలను, భయాందోళలను సృష్టించే మతం కాదని చెప్పారు. 

ఇరు దేశాల మధ్య కొత్త శకం..
భారత్‌–ఇరాన్‌ మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమవుతోందని రౌహనీ చెప్పారు. భారత్‌–ఇరాన్‌ మధ్య దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు ఉన్నాయని, భారత్‌తో వ్యాపార, దౌత్య సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్యా సంబంధాలు వెస్ట్రన్‌ ఆసియా దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల ఎదుగు దలకు దోహదం చేస్తాయన్నారు. భారతదేశం ఓ పుష్పగుచ్ఛం లాంటి దని, ఓ పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులూ ఉంటాయని, అలాగే భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, తెగలు ఐకమత్యంతో ఉంటున్నా యని పేర్కొన్నారు. ఇరు దేశాలు టెక్నాలజీ, వైజ్ఞానిక రంగాల్లో సహాయ, సహకారాలు అందించుకోవాలని రౌహనీ సూచించారు. భారత్‌లో అన్ని వర్గాల మధ్య శాంతి, సామరస్యం ఎప్పటికీ కొన సాగాలని ఆకాంక్షించారు. పలు దేశాలు ఇరాన్‌ ప్రజలకు వీసాల జారీలో జాప్యం చేస్తున్నాయని, ఇరాన్‌ మాత్రం అన్ని దేశాలు ప్రత్యే కించి భారత ప్రజలకు వీసాల జారీని సులభతరం చేసిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top