హరిత హననం

haritha haram is going not well - Sakshi

     పచ్చని చెట్లపై గొడ్డలివేటు

     సెస్‌ అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

వేములవాడ : రాష్ట్రాన్ని హరితవనంగా మార్చుదాం.. పచ్చదనంతోనే మానవ మనుగడ.. మొక్కలు సంరక్షిద్దాం.. కాలుష్యాన్ని నివారిద్దామన్న ప్రభుత్వ ప్రచారం ఓ వైపు.. అభివృద్ధి పనులు, జాతర ఏర్పాట్ల కోసం పచ్చని చెట్లను నరికేస్తున్న తీరు మరోవైపు.. హరితహారంలో భాగంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే, అధికారులు ఇలా చెట్లు నరికివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే హరిత తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. 

వేములవాడ పట్టణంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లలో భాగంగా సెస్‌ అధికారులు చెట్లు నరికేస్తున్నారు. ఏళ్ల తరబడి కంటికిరెప్పలా కాపాడుకున్న చెట్లను కొట్టేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా పట్టణంలో లక్షన్నర మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీనికోసం వీధుల్లో రోడ్లకిరువైపులా మొక్కలు నాటారు. హరితహారంలో నాటిన మొక్కలను ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సంరక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కలను పట్టించుకునే వారు లేక ఎండిపోయాయి. రెండేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి, పచ్చగా కళకళలాడుతున్నాయి. కానీ వాటిని సెస్‌ అధికారులు కరెంట్‌ సరఫరాకు అటంకం కల్గిస్తున్నాయని నరికేస్తున్నారు. శనివారం పట్టణంలోని సినారె కళామందిరం, సెస్‌ ఆఫీస్‌రోడ్డు, చెక్కపల్లిరోడ్డు, తెలంగాణచౌక్‌ తదితర ప్రాంతాల్లోని దాదాపు ఇరవైకి పైగా చెట్లను పూర్తిగా నరికివేసేశారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరికి వేయడానికి అయితే హరితహారం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కరెంట్‌ తీగలకు అడ్డుగా వచ్చిన కొమ్మలను కొట్టేయాలని, మొత్తం చెట్లను నరికేయడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు. 

రెండేళ్లు సంరక్షించా..

సినారె కళామందిరం ముందున్న చెట్లను రెండేళ్లుగా సంరక్షిస్తున్నా. శనివారం మా దుకాణం ఎదుట ఉన్నా చెట్లను నరికి వేశారు. పచ్చని చెట్లు పోయి, మొండెం మిగిలింది. 
– దేవయ్య, వేములవాడ 

అధికారులు స్పందించాలి

నాటిన మొక్కలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాం. ఏదో కొంపలు అంటుకుని పోతున్నట్లు ఏపుగా పెరిగిన చెట్లను కొట్టేశారు. నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. 
– రామారావు, వేములవాడ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top