మీరే మార్గదర్శకం

Harish Rao Comments about Telangana Movement - Sakshi

మీ బాటలో పయనించే తెలంగాణ సాధించాం..: హరీశ్‌

ఆచార్య జయశంకర్‌ ఆశయాన్ని సీఎం కేసీఆర్‌ నెరవేర్చారని వ్యాఖ్య 

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): ‘మీరు నాడు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చూపిన పోరాట స్ఫూర్తే మాకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో దివ్య ఔషధంలా పని చేసింది. మీరు చూపిన బాట లోనే పయణించి తెలంగాణ సాధించాం..’అని 1969 తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగి 50 ఏళ్లు ముగిసిన సందర్భంగా నాటి ఉద్యమకారులను ఆదివారం సన్మానించారు. సిద్దిపేట పట్టణంలో ‘సమర స్ఫూర్తికి స్వరో్ణత్సవం’పేరిట జిల్లాకు చెందిన 70 మంది 1969 ఉద్యమకారులను సన్మానించారు. అంతకుముందు పట్టణంలోని జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం సభలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి, జయశంకర్‌ చిత్రప టాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు.

గౌరవించుకోవాల్సిన బాధ్యత మనదే 
అనంతరం హరీశ్‌ మాట్లాడుతూ.. నాడు 1919 లో నిజాం సర్కార్‌ హయాంలోనే నాన్‌ముల్కి ఉద్యమం ద్వారా తెలంగాణ ఆకాంక్షను నాటి ఉద్యమకారులు వెలువరించారని, అనంతరం 1952లో ఈ ఉద్యమ సెగలు పెరిగాయని చెప్పా రు. 1969లో ఉధృతమైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే దాకా ఆగలేదన్నారు.  ఆ ఉద్యమకారుల్లో కొంతమందే నేడు జీవించి ఉన్నారని వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 

ఉద్యమానికి వెలుగురేఖగా సిద్దిపేట 
నాటి పాలకులు ప్రాంతీయ విభేదాలు చూప డంతోనే ఈ ఉద్యమం ఎగిసిపడిందని.. నీరు, నియామకాలు, నిధుల కోసమే ఈ పోరాటం జరిగిందని హరీశ్‌ తెలిపారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాన్ని సీఎం కేసీఆర్‌ నెరవేర్చారన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట వెలుగురేఖగా దిశను చూపించిందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను గౌరవించటం రాష్ట్రంలోనే తొలిసారని, ఇది తన ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉందని హరీశ్‌ చెప్పారు. 1969 చరిత్ర సిద్దిపేట జిల్లా అనే పుస్తకాన్ని ముద్రించాలని ఆయన ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డిలను కోరారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్, సరోత్తంరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ రోజాశర్మ, బెవరెజ్‌ చైర్మన్‌ దేవీప్రసాద్, ఎలక్షన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సూడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top