గలగలా గోదారి కదిలి వచ్చింది

Harish Rao And KTR Who Released Waters Of Kaleshwaram To Siddipet - Sakshi

రంగనాయకసాగర్‌లోకి కాళేశ్వర గంగ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌

భగీరథునికన్నా సీఎం కేసీఆర్‌ గొప్ప అన్పించుకున్నారన్న కేటీఆర్‌

సిద్దిపేటకు కాళేశ్వర జలాలతో జన్మ చరితార్థమైందన్న హరీశ్‌

సాక్షి, సిద్దిపేట : ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయం నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి అదనంగా నీరు ఇవ్వగలిగాం. నిజాంసాగర్‌ను పూర్తి చేసుకుంటున్నాం. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో జలకళ ఉట్టిపడు తుంది. సాగునీటి కోసం ఇబ్బందిపడ్డ రైతుల కష్టాలు తీరి దేశానికే ఆదర్శవంతమైన వ్యవ సాయ కేంద్రంగా తెలంగాణ విరాజిల్లుతుంది’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.

మూడు టీఎంసీల సామర్థ్యం, 1,10,718 ఎకరాలకు సాగునీరు అందించేలా సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మించిన శ్రీ రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను శుక్రవారం మంత్రులు హరీశ్, కేటీఆర్‌ ప్రారంభించారు. తొలుత రంగనాయకసాగర్‌ కొండపై ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్, హరీశ్‌రావు అక్కడి నుంచి పంప్‌హౌస్‌ వద్దకు చేరుకొని పంపులను స్విచ్‌ ఆన్‌ చేశారు. దాదాపు 10 నిమిషాల వ్యవధిలో రంగనాయకసాగర్‌లోకి వచ్చిన గోదావరికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిదులు పసుపు, కుంకుమలు విడిచిపెట్టి స్వాగతం పలికారు. పంప్‌హౌస్‌లోంచి నీరు పైకి ఎగసిపడే క్రమంలో కేటీఆర్, హరీశ్‌పైనా నీరు చిమ్మడంతో వారు తడిసి ముద్దయ్యారు. అనంతరం గుట్టపై ఉన్న విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లోకి చేరుతున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు

భగీరథుడికన్నా గొప్పగా...
ఆకాశంలో ఉన్న గంగను భూమికి తీసుకొచ్చిన భగీరథుడి గురించి అందరం చెప్పుకుంటామని, కానీ భూమిపై ఉన్న గోదావరిని ఎత్తైన ప్రదేశంలోకి తీసుకొచ్చి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్‌ భగీరథునికన్నా గొప్ప అన్పించుకున్నారని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. మెతుకుసీమగా పిలిచే ఉమ్మడి మెదక్‌ జిల్లా పేరే మెతుకు అనే పేరు నుంచి వచ్చిందని, గోదావరి జలాలు ఉమ్మడి మెదక్‌ జిల్లాను ముద్దాడిన తర్వాత మొత్తం తెలంగాణకు బువ్వపెట్టే జిల్లాగా కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నీటివనరులు పెరిగితే ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.  చదవండి: తెలంగాణకు కేంద్ర బృందం 

నాలుగు విప్లవాల ద్వారా ఆర్థిక అభివృద్ధి
దశలవారీగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతోందని, రాబోయే రోజుల్లో నాలుగు రకాల విప్లవాల ద్వారా తెలంగాణ గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, దేశానికే ఆదర్శంగా నిలస్తుందని కేటీఆర్‌ చెప్పారు. నీటి వసతులతో ఈ విప్లవాలు అనుబంధంగా ఉంటాయని చెప్పారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ ఆవిర్భవిస్తుందన్నారు. దీంతో రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతుందని చెప్పారు.

చెరువులు, కుంటల్లో నీరు సంమృద్ధిగా ఉంటే మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, దీంతో నీలి విప్లవం వస్తుందన్నారు. అదేవిధంగా పంటలు పండి, పచ్చటి చేలు, గడ్డితో పల్లెలు ఆహ్లాదకరంగా ఉంటే పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, దీంతో శ్వేత విప్లవం వస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేశామని, దీంతో మాంసం ఉత్పత్తులు పెరుగుతున్నాయని, ఈ పెరుగుదల పింక్‌ రివల్యేషన్‌కు చిహ్నమన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సంపద పెరుగుతుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

సర్జికల్‌ పంప్‌హౌస్‌లో రెండో మోటార్‌ను ప్రారంభిస్తున్న హరీశ్, కేటీఆర్‌. చిత్రంలో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి 
హరీశ్‌రావు చరిత్ర తిరగరాశారు...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు పనిచేసి చరిత్ర తిరగరాశారని కేటీఆర్‌ కొనియాడారు. గతంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా రేయింబయళ్లు పనిచేసి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారన్నారు. రాజకీయంగా ఆదరించిన సిద్దిపేట అంటే ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమని, సీఎం తర్వాత సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపి హరీశ్‌రావు సమర్థతను రుజువు చేసుకున్నారన్నారు.

నాయనమ్మ, అమ్మమ్మ ఊర్లు మునిగాయి.. 
ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని కేటీఆర్‌ కొనియాడారు. ఇతర పార్టీల వారికి నిర్వాసితుల బాధ తెలియదని విమర్శించారు. ఎగువ మానేరు నిర్మాణం సందర్భంగా తన నాయనమ్మ గ్రామం దొమకొండ మండలం పూసాన్‌పల్లి మనిగిపోయిందని, మధ్యమానేరు నిర్మాణంలో అమ్మమ్మ గ్రామం కొదురుపాక మునిగిపోయిందని కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో మేజర్‌ కాల్వల నిర్మాణం పూర్తయిందని, ఏ గ్రామానికి ఆ గ్రామ పెద్దలు కథానాయకులుగా మారి చిన్న కాల్వల నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు.

అసాధ్యమన్న పనులు సుసాధ్యం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తుంటే అందరూ అసాధ్యమని విమర్శలు చేశారని, కానీ అసాధ్యమన్న పనులను సుసాధ్యం చేసి రైతులకు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ వద్ద పారే గోదావరిని 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్‌కు, 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపొచమ్మ సాగర్‌ వరకు పంపింగ్‌ చేయవచ్చని రుజువు చేశారన్నారు. కరవు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణలో సాగునీటి అవసరాన్ని గుర్తించిన సీఎం... ఇంజనీర్‌గా పనిచేయడంతోపాటు అందరితో పని చేయించారన్నారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణమంటే 3–4 దశాబ్దాల కాలం పట్టేదని, కానీ సీఎం కేసీఆర్‌ పట్టుదలతో పనిచేయించి మూడున్నర సంవత్సరాల్లోనే పనులు పూర్తి చేయించారన్నారు. 

కూలీలతో సహపంక్తి భోజనం చేస్తున్న మంత్రులు 
అన్నదాత కష్టాలు తీరేరోజు... 
వర్షం, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు కాలం, కరెంట్‌తో పనిలేకుండా కాల్వల ద్వారా రెండు పంటలు పండించుకునేలా సాగునీరు అందుతుందని హరీశ్‌రావు చెప్పారు. అప్పులు చేసి బోర్లు వేసి బోర్లాపడ్డ రైతులు వలసలు, ఆత్మహత్యలు చేసుకునేవారిని గుర్తుచేశారు. వర్షం ఎప్పుడొస్తుందో అని మోగులు చూసే రైతులకు గోదావరి జలాలు ఈ నేలను ముద్దాడడాన్ని చూసి సంబుర పడిపోతున్నారన్నారు. గోదావరి జలాల ద్వారా చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఉపరితల నీటివనరుల ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. నీరు అభివృద్ధికి సూచిక అని, నీటివనరులు పెరిగితే మానవ మనుగడలో మార్పు వస్తుందన్నారు. ‘‘ఎకానమే కాకుండా ఎకాలజీ’’లో కూడా మార్పు వస్తుందని చెప్పారు.

నా జన్మ చరితార్థం...
తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమ నేత వెంట ఉండి పనిచేయడం, దేశంలోనే మహోన్నత ఘట్టం కాళేశ్వరం జలాలు సిద్దిపేట జిల్లాను ముద్దాడే కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు తన జన్మ చరితార్థం అయిందని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషం కలిగిందో రంగనాయకసాగర్‌ నీటిని విడుదల చేసినప్పుడూ అంతే సంతోషం కలిగిందన్నారు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ సమక్షంలో లక్షల మంది మధ్య జరుపుకోవాల్సి ఉండేదని, కానీ కరోనా వైరస్‌తో తక్కువ మందితో జరుపుకుంటున్నామన్నారు.

గోదావరి జలాలు రంగనాయకసాగర్‌లో పారుతుంటే ఆ జలాల్లో రైతులు పండించబోయే ధాన్యం సిరులు కన్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్, బి.వెంకటేశ్వర్లు, కూర రఘోత్తంరెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్‌ సొలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఒడితల సతీష్‌ కుమార్, రసమయి బాలకిషన్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాసరావు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ రాష్ట్ర సలహాదారులు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరాం, సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టణం నుంచి పల్లెకు మహా పయనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top