హరీష్ ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నం | Sakshi
Sakshi News home page

హరీష్ ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నం

Published Wed, Aug 13 2014 12:28 AM

హరీష్ ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నం - Sakshi

- ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్
- అడ్డుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు

సిద్దిపేట టౌన్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత  విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నేతలు, కార్యకర్తలు మంగళవారం సిద్దిపేటలోని మంత్రి హరీష్‌రావు ఇంటిని ముట్టడించడానికి విఫలయత్నం చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు ఏబీవీపీ జెండాలు పట్టుకొని మెరుపు వేగంతో మంత్రి ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకుప్రయత్నించగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా, ఏబీవీపీ కార్యకర్తలు నవీన్, లక్ష్మణ్,  దుర్గాప్రసాద్‌లకు గాయలయ్యాయి.

సమాచారం అందుకున్న సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏబీవీపీ కార్యకర్తలను స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం పలువురు ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ,  పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1956 నిబంధనలను రాష్ట్రపతి, గవర్నర్ ఆదేశాల మేరకు అమలు చేయాలన్నారు. వివిధ సెట్ల అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఏబీవీపీ నేతలు అంజి, దుర్గప్రసాద్, సాయి, భాను, రవితేజ, శివ, సాగర్, శ్రీకాంత్, సచిన్, భరత్, శశికర్, రమేష్, అనిల్, బాల్‌రాజ్, నరేందర్, రాంచంద్రం, శిరీష్, రహీం, కరుణాకర్, సందేశ్‌లు పాల్గొన్నారు.
 
విద్యార్థులపై దాడి శోచనీయం: బీజేవైఎం
ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నేతలపై దాడి చేయడం, నిర్బంధించడం సరైంది కాదని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వినతి పత్రం ఇవ్వడానికి మంత్రి ఇంటికి వెళ్లిన విద్యార్థులపై దాడి చేయడం శోచనీయమన్నారు. బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నేతలు రాజశేఖర్‌రెడ్డి, లిఖిత్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement