టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన వెంకటరెడ్డి

Group Politics In TRS In Khammam - Sakshi

సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఇప్పటికే గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో గందరగోళం నెలకొంది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులు ఎవరికి వారుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపు పూర్తయ్యేలోగా గ్రూపు రాజకీయాలు మరింత విస్తృతమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగగా, ఇప్పుడు రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తాజాగా అశ్వారావుపేట నియోజకవర్గంలో కీలకమైన నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయంగా అత్యంత కీలకమైన చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలను ప్రభావితం చేసే సీనియర్‌ నాయకుడు కొడకండ్ల వెంకటరెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు.

ఆయనతో పాటుగా రెండు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అధికార పార్టీకి రాజీనామా చేశారు. దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి యువజన కాంగ్రెస్‌ నేతగా ఉన్న సమయంలో కొడకండ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అనుచరుడిగా వ్యవహరించారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొత్తగూడెం నియోజకవర్గంలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలు ఉన్నాయి. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపులో సైతం కొడకండ్ల కీలకపాత్ర పోషించారు. తరువాత కాలంలో ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీటీసీ, సర్పంచ్‌ అభ్యర్థుల విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలిచేందుకు సైతం కీలకంగా వ్యవహరించారు. తాటి వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో నియోజకవర్గం నుంచి తన అనుచరులతో కొడకండ్ల కూడా వెళ్లారు. అయితే తాటి వెంకటేశ్వర్లు తనకు ప్రాధాన్యత తగ్గించారంటూ గత ఏడాది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభకు రెండు రోజుల ముందు తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. దీంతో తాటి వెంకటేశ్వర్లుకు భారీ దెబ్బ తగిలినట్టయింది. వచ్చే ఎన్నికల్లో తాటికి గడ్డు పరిస్థితే అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కొడకండ్లను కలిసిన జలగం ప్రసాదరావు..
ప్రగతి నివేదన సభకు వెళ్లినప్పటికీ.. తాటి వెంకటేశ్వర్లుకు ఆందోళన కలిగించే అంశం చోటుచేసుకుంది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు కలిగి ఉన్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు చంద్రుగొండకు వచ్చి కొడకండ్ల వెంకటరెడ్డిని కలిశారు. అత్యంత సీనియర్‌ అయిన వెంకటరెడ్డికి పూర్తిస్థాయిలో అండగా ఉంటానని ప్రసాదరావు తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చించారు. ప్రస్తుతం దేశానికి కాంగ్రెస్, రాహుల్‌ అవసరం ఉందని చెప్పిన జలగం ప్రసాదరావు కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే ఉమ్మడి జిల్లాలోని ఎక్కడినుంచైనా పోటీ చేస్తానని కొడకండ్ల ఇంటి నుంచే ప్రకటించారు. దీంతో ఈ ప్రకటన కొత్తగూడెంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో వెంకటరెడ్డి సైతం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలపై పడే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top