మనవడ్ని చంపిన తాతకు జీవిత ఖైదు

Grandfather Sentenced to Life Imprisonment for Murdering his Grandson - Sakshi

తీర్పు వెల్లడించిన కామారెడ్డి కోర్టు

కామారెడ్డి క్రైం: కుటుంబ కలహాల నేపథ్యంలో మనవడిని హత్య చేయడమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడికి కామారెడ్డి జిల్లా అదనపు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కామారెడ్డి అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వైద్య అమృతరావు కథనం ప్రకారం 2017 డిసెంబర్‌ 26న జరిగిన ఈ హత్యకేసు వివరాలిలా ఉన్నాయి. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన వడ్ల వెంకటి కుమారుడైన స్వామి ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. ఇంటి వద్ద తండ్రి వెంకటితో పాటు తల్లి పద్మ, భార్య కృష్ణవేణి, కొడుకు దేవేందర్‌స్వామి (12) ఉంటున్నారు. 2017 డిసెంబర్‌ 26న కుటుంబ సభ్యులంతా కలిసి పత్తి చేనులో పనికి వెళ్లారు. ఒంటి గంట ప్రాంతంలో దేవేందర్‌స్వామి చదువుకుంటానని చెప్పి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత తాత వడ్ల వెంకటి కూడా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే దేవేందర్‌స్వామి ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. తన మనవడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తాత వెంకటి చుట్టుపక్కల వారిని, పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు.

కానీ అతనిపై అనుమానంతో కోడలు కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిపై హత్య నేరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అప్పటి భిక్కనూరు సీఐ కోటేశ్వర్‌రావు కేసును దర్యాపు చేసిన తర్వాత కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడి కోడలు కృష్ణవేణితో పాటు మరో 10 మంది సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. హత్య జరిగిన సమయంలో తాత, మనవడు కాకుండా మరెవెరూ ఇంట్లో లేకపోవడం, వెంకటి స్వయంగా తన మనవడు ఆత్మహత్య చేసుకున్నాడని అందర్నీ నమ్మించడం, పోస్టుమార్టంలో అది హత్యగా తేలడంతో పాటు మిగతా సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు తాతే మనువడిని హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో వెంకటికి జీవితఖైదు, రూ.500 జరిమానా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు గాను మరోమూడు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కామారెడ్డి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్తయ్య మంగళవారం తీర్పు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top