3 లేదా 4లోగా ‘పంచాయతీ’ నోటిఫికేషన్‌?

Gram Panchayat Elections Notification Release Soon - Sakshi

రేపటిలోగా ప్రభుత్వానికి రిజర్వేషన్ల జాబితా

రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలన తర్వాత నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల మూడు లేదా నాలుగు తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోల్చితే బీసీ రిజర్వేషన్లు గణనీయంగా తగ్గిపోవడంపై కొన్ని వర్గాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా న్యాయపరంగా ఏవైనా చిక్కులు ఎదురైతే తప్ప అనుకున్న తేదీకే ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటన విడుదల కావొచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ శుక్రవారానికల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి.

దీంతో శనివారంలోగా పూర్తి జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్లు, డీపీఓలను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై జిల్లా, మండల స్థాయిలో కసరత్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే సగానికిపైగా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు పూర్తయినట్లు సమాచారం. కొన్నిచోట్ల మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల నిర్ధారణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కిందిస్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సాంతికేతిక, ఇతరత్రా సమస్యలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారానికల్లా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు పీఆర్‌ కమిషనర్‌కు అందే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటికి అనుగుణంగానే జిల్లాల్లో రిజర్వేషన్లపై కలెక్టర్లు గెజిట్‌లు విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. జిల్లాల నుంచి వచ్చిన గెజిట్‌లను క్రోడీకరించి పీఆర్‌ ముఖ్యకార్యదర్శి లేదా కమిషనర్‌ వైపు నుంచి శనివారానికల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) రిజర్వేషన్ల జాబితా అందించవచ్చని తెలుస్తోంది. ఈ జాబితాను అన్ని కోణాల్లో పరిశీలించి వాటిపై న్యాయ సలహా తీసుకున్నాక ఎస్‌ఈసీ కూడా రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top