మళ్లీ ‘పదోన్నతుల’ ఆశలు 

Govt Teachers Promotions Telangana - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: ఏకీకృత సర్వీస్‌రూల్స్‌పై రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుస్టే ఇవ్వడంతో ఉపాధ్యాయుల్లో పదోన్నతుల ఆశలు రేకెత్తుతున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా పదోన్నతులు లేక మానసికంగా ఇబ్బందులకు గురవుతున్న టీచర్లకు సుప్రీంకోర్టు తాజా స్టే ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ నిబంధనలపై రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు చెల్లవని 2018 ఆగస్టులో హైకోర్టు తీర్పుఇచ్చింది. తాజాగా సోమవారం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడంతో పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఖాళీలతో విద్యాశాఖ అస్తవ్యస్తం..
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 70 మండలాలు ఉండగా, కొత్త జిల్లాల వారీగా పరిశీలిస్తే..నిర్మల్‌లో 19, ఆదిలాబాద్, మంచిర్యాలల్లో 18 మండలాల చొప్పున ఉండగా, ఆసిఫాబాద్‌లో 15 మండలాలు ఉన్నాయి. దాదాపు 4 వేల వరకు ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలలు ఉండగా, 4 లక్షల 80 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి జిల్లాలో రెగ్యులర్‌ ఎంఈవో ఒక్కరే ఉండగా, డైట్‌ కళాశాలలో లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ప్రభావం పదోతరగతి ఫలితాలపై ఏటా పడుతోంది. ఉమ్మడి జిల్లా ఫలితాలపరంగా చూస్తే రాష్ట్రంలో చివరిస్థానంలో ఉన్నాం.

కౌటాల ఎంఈవో మాత్రమే రెగ్యులర్‌ కాగా మిగతా అందరూ ఇన్‌చార్జి అధికారులే. ప్రధానోపాధ్యాయులు ఎంఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు పోస్టుల్లో దేనికి న్యాయం చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా కొత్తగా ఏర్పడిన మండలాలకు కూడా ఎంఈవోలను నియమించలేదు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో మంచిర్యాల, ఆదిలాబాద్‌ డిప్యూటీ ఈవో, జెడ్పీ డిప్యూటీ ఈవోలు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ ఉండగా, ప్రస్తుతం ఒకరు ఆదిలాబాద్‌ డీఈవోగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతులు చేపడితే ఎంఈవో పోస్టులు, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు, డైట్‌ లెక్చరర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యాబోధన జరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నట్లు తెలుస్తోంది.

రెండు దశాబ్దాలుగా ఎదురుచూపు..
ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ నిబంధన అమలుకాకపోవడంతో రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించక నష్టపోతున్నారు. లోకల్‌ బాడీ ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని, ప్రభుత్వ యజమాన్యంలో పని చేస్తున్న (డీఈవో పరిధిలో) ఉపాధ్యాయులు మాత్రం యాజమాన్యాల వారీగానే పదోన్నతులు చేపట్టాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది.

దీంతో మళ్లీ పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా మరోసారి ప్రభుత్వ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అయితే సుప్రీంలో కేసు విచారణ చేపట్టే వరకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తే ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు మేలు జరుగుతుందని పలు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఖాళీల భర్తీతో విద్యావ్యవస్థ పటిష్టం కానుంది. కాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు  హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ వివాదం 
పంచాయతీరాజ్, జడ్పీ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ ఉండాలనేది పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇది అమలుకాకపోవడంతో ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్‌ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు పదోన్నతులు లభించడంలేదు. 1998 నుంచి ఇప్పటివరకు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఎంఈవో, జేఎల్, డైట్‌ లెక్చరర్‌ పోస్టుల పదోన్నతులకు తామే అర్హులమని కోర్టును ఆశ్రయించారు. అయితే పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు తాము కూడా ఉపాధ్యాయులమేనని, పట్టణ ప్రాంతంలో విధులు నిర్వహించకూడదా అనేది వారి వాదన. అదేవిధంగా ఎంఈవో, జేఎల్‌ డిప్యూటీ ఈవో, డైట్‌లెక్చర్‌ పోస్టులకు తాము అర్హులమేనని కోర్టులో పిల్‌ దాఖలు చేస్తున్నారు. కోర్టుల్లో ఉండడంతో పదోన్నతులు నిలిచిపోతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top