
పుస్తకం చదవకుండా తనకు రోజు గడవదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: పుస్తకం చదవకుండా తనకు రోజు గడవదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను సోమవారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో మాట్లాడారు. పుస్తక ప్రదర్శనకి రావడం చాలా సంతోషంగా ఉందని, అందరూ పుస్తక పఠనం చేయాలని కోరారు. తాను గవర్నర్, రైటర్, డాక్టర్ అయినప్పటికీ చదువరిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు.
తనను కలవడానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు కాకుండా పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఇల్లు కట్టుకునే వారు తప్పనిసరిగా రీడింగ్ రూమ్ ఉండేలా చూసుకోవాలన్నారు. పుస్తకం చదవడం చాలా ముఖ్యమైన పని అని, తాను ఇంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు పడుకునే ముందు ఒక గంట బుక్ చదువుతానని వెల్లడించారు. యువత ప్రతి ఒక్కరు ఇక్కడున్న 330 బుక్ స్టాల్స్ ని సందర్శించాలని అభిలషించారు. బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పుస్తక ప్రదర్శనకు నగర వాసులు భారీగా తరలిచ్చారు.