బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌

Government  Introduce Breakfast Scheeme In  Government Schools Medak - Sakshi

సాక్షి, నారాయణఖేడ్‌(మెదక్‌) : పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం సమస్య తీర్చడంతోపాటు, పాఠశాలల హాజరు శాతం పెంచాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి తోడు ఉదయం పూట అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌) కూడా వడ్డించాలని యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుండడంతో కొన్నేళ్లుగా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య కూడా కొంత వరకు తీర్చగలుగుతున్నారు. దీనికి తోడు ఉదయం పూట అల్పాహారం కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో జిల్లాలోని లక్ష పై చిలుకు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఒక్కొక్కరికి మధ్యాహ్న భోజనం కోసం రూ.4.13 ఇచ్చే వారు. ఇప్పటి నుండి రూ.4.35లకు పెంచారు.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు రూ.6.18 నుండి రూ.6.51కి పెంచారు. విద్యార్థులకు వారంలో రెండు రోజులపాటు గుడ్డును అందిస్తున్నారు. గతంలో ఒక్కో గుడ్డుకు రూ.4 చెల్లించగా, ఇప్పుడు రెండు రూపాయిలు పెంచి రూ.6 చెల్లించనున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నారు. పెరిగిన ధరలతో విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందనుంది. విద్యార్థులకు మేలు జరగనుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వల్ల విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపం సమస్య తీర్చడానికి తోడు విద్యార్థుల హాజరు శాతం పెరిగేందుకు దోహద పడుతుంది. ఆయా పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. ఒక పూట ఆహారం అందించడం వల్ల కొంతవరకు సమస్య తగ్గింది. రెండు పూటలా ఆహారం అందిస్తే వారిలో పౌష్టికాహార లేమి చాలా మటుకు దూరం చేయవచ్చు.

ఉచితంగా ఆహారం అందించడం ద్వారా పేద కుటుంబాల పిల్లలు బడులకు వచ్చే అవకాశమూ ఉంటుంది. అల్పాహారంలో భాగంగా విద్యార్థులకు పాలు, పండ్లు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. అల్పాహారం అందించడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 12లక్షల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదివే 12 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతోందని అధికారులు అంచనా వేశారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ఆరంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 862 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 48,614మంది విద్యార్థులు, 199 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా ఇందులో 16,470మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలలు 203 ఉండగా ఇందులో 62,360 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా మొత్తంలో 1,264పాఠశాలల్లో 1,27,444మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పథకం అమలుతో ఈ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 

ధరల పెంపుతో భోజనం మెరుగు.. 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ చార్జీలు పెరిగాయి. దీంతో వారికి నాణ్యమైన భోజనం అందనుంది. గతంలో ధరలు తక్కువగా ఉండడంతో నాణ్యమైన భోజనం అందించడం నిర్వాహకులకు కష్టంగా మారేది. రోజురోజుకూ కూరగాయల ధరలతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం ధరలు పెరగకపోవడంతో నిర్వాహకులు నాణ్యమైన ఆహారాన్ని అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటగిరీల వారీగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top