కరోనా వేళ.. ‘సూపర్‌’ కథ!

Government Approves 83 Supernumerary Posts To Pay Salaries To Excise Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రూప్‌–2 నియామకాల ద్వారా నియమితులైన ఎస్సైల వేతనాల చెల్లింపులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసమంటూ 83 సూపర్‌ న్యూమరరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఎక్సైజ్‌ శాఖలో చర్చనీయాంశమైంది. కరోనా కాలంలో కాసులకు కష్టాలు ఎదుర్కొంటున్న వేళ ఈ పోస్టులు సృష్టించి మరీ ఏడాదిపాటు వేతనాలు చెల్లించడం ఎందుకనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ పోస్టుల సృష్టి ద్వారా శాఖ పరిధిలో అడ్‌హాక్‌ పదోన్నతులు పొందిన హెడ్‌ కానిస్టేబుళ్లను రివర్షన్‌ గండం నుంచి తప్పించారని, తద్వారా చాలాకాలంగా పదోన్నతులు లేకుండా ఉన్నవారికి ఉపశమనం కలిగిందని మరికొందరు అంటున్నారు.

చాలాకాలంపాటు ఎస్సైలుగా తాత్కాలిక పదోన్నతిపై పనిచేసినవారిని.. డైరెక్ట్‌ రిక్రూటీలు వచ్చారనే కారణంతో వెనక్కు పంపడం వారిని నైతికంగా దెబ్బతీస్తుందని, అందుకే వారికి సాధారణ పదోన్నతుల సమయం వచ్చే వరకు ఈ పోస్టులు మనుగడలో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఈ ఉత్తర్వుల ద్వారా గరిష్టంగా రూ.3 కోట్ల అదనపు భారం ఆ శాఖపై పడుతుందని సమాచారం. మరోవైపు ఈ ఉత్తర్వుల జారీ కోసం కాసులు చేతులు మారాయని, ఈ నేపథ్యంలోనే హడావుడి ఆదేశాలు వచ్చాయనే మరో చర్చ కూడా ఉద్యోగుల్లో సాగుతోంది. మొత్తం మీద కరోనా కలకలం రేపుతున్న వేళ వచ్చిన సూపర్‌ న్యూమరరీ ఉత్తర్వులు ఎక్సైజ్‌ శాఖలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top