పోలీస్‌ ఓఎస్డీలకు ఇక సెలవు! 

Good bye to the police OSD - Sakshi

కీలక స్థానాల్లోని రిటైర్డ్‌ అధికారులకు త్వరలో వీడ్కోలు  

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో ఏళ్ల తరబడి ఓఎస్డీలుగా కొనసాగుతున్న రిటైర్డ్‌ పోలీసు అధికారులకు ప్రభుత్వం త్వరలో వీడ్కోలు పలకనున్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్, పోలీస్‌ అకాడమీ, విజిలెన్స్, ఆర్టీసీ, పోలీస్‌ వెల్ఫేర్, సెక్యూరిటీ వంటి విభాగాల్లో 22 మంది ఓఎస్డీలుగా పనిచేస్తున్నారు. ఓఎస్డీలను తొలగించాలని కొద్ది రోజులుగా డిమాండ్‌ వస్తోంది. గతంలో అధికారుల కొరత ఉండేది. ప్రస్తుతం పోలీస్‌ శాఖలో పరిమితికి మించి సర్వీసు అధికారులున్నారు. వీరి సేవలను పూర్తిస్థాయిలో, కీలక స్థానాల్లో ఉపయోగించుకోవాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓఎస్డీల తొలగింపు ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఎదుట పెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.  

మేం పనికిరామా? 
ఎస్‌ఐ నుంచి నాన్‌ క్యాడర్‌ ఎస్పీ హోదా వరకు పదోన్నతి పొందిన సమర్థులైన అధికారులు చాలామందే ఉన్నారు. గ్రూప్‌ వన్‌ అధికారులు కూడా తగిన సంఖ్యలోనే ఉన్నారు. అయినా వీరిని కాదని రిటైర్డ్‌ అధికారులను ఎక్స్‌టెన్షన్‌ పేరుతో ఏళ్ల తరబడి కొనసాగించడంపై పోలీస్‌ శాఖలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 22 మంది ఓఎస్డీలకు గౌరవంగా వీడ్కోలు పలకాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, కొంతమందికి మరో ఆరునెలల వరకు గడువు ఉన్నా ఎప్పుడైనా వారి ఉద్యోగాలను రద్దు చేసి ఇంటికి పంపించే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీనితో అందరినీ ఒకేసారి పంపిస్తే పక్షపాతం లేకుండా ఉంటుందని సీఎంకు వివరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

మావోయిస్టు నియంత్రణ, గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ లాంటి కీలక యూనిట్లలో సూచనలు, సలహాలు ఇస్తున్నవారిని కూడా పంపించాలని భావిస్తున్నారు. వీరి స్థానంలో అదే విభాగంలోని అనుభవజ్ఞులను నియమించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం పోలీస్‌ ఉన్నతాధికారుల ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతుందా? లేదా అన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top