బాలాత్రిపుర సుందరిగా దుర్గమ్మ దర్శనం

Goddess Kanaka Durga Decorated As Bala Tripura Sundari Dev - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  మల్లికార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన లక్షకుంకుమార్చనలో దంపతులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న అన్నదాన భవనంలో భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం మల్లేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన శ్రీ గంగా పార్వతీ సమేత నగరోత్సవం అర్జునవీధి మీదుగా ఇంద్రకీలాద్రి వరకు కనుల పండువగా సాగింది. దసరా ఉత్సవాల్లో మూడోరోజు అమ్మవారు భక్తులకు గాయత్రీదేవిగా దర్శనం ఇస్తారు.

చిన్నశేషుడిపై గోపాలుడి విహారం
తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల రెండో రోజు గురువారం ఉదయం చిన్నశేషవాహనం, రాత్రి హంసవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 7.00 నుంచి 8.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. ఉదయం శ్రీమలయప్ప స్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై పండరీపురం శ్రీపాండురంగ స్వామి అలంకారంలో ఊరేగారు.

వెలసిపోయింది!
   బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన చిన్నశేష వాహన సేవ పీఠానికి బంగారుపూత వెలసిపోయి కనిపించింది. పీఠానికి అమర్చిన రాగిరేకు కనిపించడంతో భక్తులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు.

అన్నపూర్ణగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్‌: శ్రీ భద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారిని అన్నపూర్ణా దేవీగా అలంకరించారు. గురువారం ఉదయం 4గంటలకు ఆలయ ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు నిత్యాహ్నికం, సుప్రభాత పూజలు జరిపారు. అమ్మవారి స్వపనమూర్తిని అన్నపూర్ణ అమ్మవారిగా అలంకరించి మకరవాహనంపై ఊరేగించారు. రాత్రి 9గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు మహానీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం జరిపిన మహాప్రసాదవితరణ కార్యక్రమంలో దేవాదాయశాఖ డీసీ నర్సింహులు పాల్గొన్నారు. శుక్రవారం అమ్మవారిని గాయత్రీగా అలంకరించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top