జయహో శాకంబరీ మాత! | Aashada Masam warangal bhadrakali temple significance and importance | Sakshi
Sakshi News home page

Aashada Masam జయహో శాకంబరీ మాత!

Jul 10 2025 9:46 AM | Updated on Jul 10 2025 10:33 AM

Aashada Masam warangal bhadrakali temple significance and importance

అమ్మవారంటే సాక్షాత్తూ అమ్మే. ఈ సృష్టిలోని జీవరాసులన్నింటికీ అమ్మ అయిన జగన్మాత అందరి ఆకలిని తీర్చడానికి శాకంబరి దేవి అవతారంలో ఉద్భవించింది. ఈ దేవిని పూజించటం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆకలి బాధ ఉండదనీ భక్తులు విశ్వసిస్తారు. వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి శాకంబరీ దేవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో  అలంకరిస్తారు. ఇందుకు సంబంధించిన పురాణ గాధ తెలుసుకుందాం...∙ఆషాఢ ఉత్సవాలువేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సులు అందక శక్తి హీనులై΄ోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది.

ఋషులు, దేవతలు సర్వ శక్తిస్వరూపిణి అయిన  పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో ‘శతాక్షి’గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకంలో వున్న దుస్థితి ని చూసి అమ్మవారి ఒక  కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచెం వ్యవధి  పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్ళతో సహా ఒక పెద్దచెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని  ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం.

పార్వతీదేవి దుర్గగా, తన నుంచి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. అలనాటి ఈ ఘటనకు ప్రతీకగా విజయవాడ ఇంద్రకీలాద్రితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవీ ఆలయాల్లో ఆషాఢ మాసం లో శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. శుక్లపక్ష త్రయోదశి నుంచి  పౌర్ణమి వరకు మూడు రోజులు ఈ ఉత్సవాలు సాగుతాయి.

వరంగల్‌లోని భద్రకాళీ ఆలయంలో మొదటిసారిగా ఆషాడ శుద్ధ  సౌర్ణమి నాడు శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో శాకంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు... అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు... వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను.. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను.. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకంబరీదేవిగా ప్రసిద్ధి  పొందుతానని’ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.

కనకదుర్గ గుడిలో కూరగాయలతో అలంకరణ
ఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది. ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు  పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి  పొందింది. ఈ శాకంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమినాడు షోడశకళా ప్రపూర్ణుడవుతాడు.

చదవండి: తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం చేస్తున్నా: ఉపాసన కొణిదెల
 

ఆషాఢమాసంలో ఆలయానికి వెళ్లే అవకాశం లేని భక్తులు కనీసం అమ్మవారి ముందు రకరకాల పండ్లు, కూరగాయలను ఉంచి, వీలయితే వాటితో అమ్మవారిని అలంకరించి, ముందుగా కొన్ని మనం స్వీకరించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచిపెడితే చాలా మంచిది. అందుకు కూడా వీలు లేనివారు కనీసం శాకంబరీ ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారిని తలచుకుని పేదలకు పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం ఫలదాయకం.

వరంగల్‌ శ్రీభద్రకాళి దేవాలయంలో గత నెల జూన్‌ 26న సహస్ర కలశాభిషేకంతో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15రోజుల పాటు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించారు. నేడు గురువారం  పౌర్ణమి సందర్భంగా మహాశాకంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!

– అడ్లూరి సునందాశివప్రసాద్‌ 
సాక్షి, హన్మకొండ కల్చరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement