శ్రీవారి వాకిలి.. బంగారు లోగిలి | Electro Gold Plating Work With Rs.262 Crores In Dwaraka Tirumala, More Details Inside | Sakshi
Sakshi News home page

ద్వారకాతిరుమల శ్రీవారి వాకిలి.. బంగారు లోగిలి

Dec 11 2024 5:12 AM | Updated on Dec 11 2024 5:22 PM

Tirupati: Electro gold plating work with Rs. 2. 62 crores

స్వామి అంతరాలయం, ముఖ ద్వారాలు స్వర్ణమయం 

రూ.2.62 కోట్లతో ఎలక్ట్రో గోల్డ్‌ ప్లేటింగ్‌ పనులు

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయం స్వర్ణ శోభితమైంది. స్వామివారి భక్తులకు కనువిందు చేస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న వాకిలి నుంచి చిన వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాతల సహకారంతో దేవస్థానం ఇప్పటికే స్వామివారి వాకిలిని దాదాపుగా స్వర్ణ మయం చేశారు.

అందులో భాగంగా జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ 2021 లో రూ.98,31,693 వ్యయంతో, 264 గ్రాముల 647 మిల్లీ గ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీ గ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులకు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం (ఎలక్ట్రో గోల్డ్‌ ప్లేటింగ్‌) చేయించారు. వీటిని అదే సంవత్సరం జనవరి 10న అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.

కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, బొమ్ములూరుకు చెందిన దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు రూ.1,64,19,411తో స్వామి అంతరాలయానికి బంగారు తాపడాన్ని చేయించారు. దీన్ని ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు ఈ ఏడాది అక్టోబర్‌ 4న ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, దాతలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు.  

త్వరలో స్తంభాలకు బంగారు పూత  
అంతరాలయం ముందు పద్మావతి, ఆండాళ్‌ అమ్మవార్లు ఎదురుగా ఉన్న స్తంభాలకు ఇదే తరహాలో గోల్డ్‌ కోటెడ్‌ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో ఒక దాత సహాయంతో పనులు ప్రారంభించనున్నారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే విమాన గోపుర స్వర్ణమయ పథకం ద్వారా భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సేకరిస్తోంది. విమాన గోపురాన్ని సైతం స్వర్ణమయం చేస్తే చినవెంకన్న ఆలయాన్ని చూడడానికి రెండు కనులు చాలవనే చెప్పొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement