 
													మహిళల స్నానాల గదిలోకి చూస్తుండగా పట్టుకున్న సిబ్బంది
దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగింత
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం కల్యాణకట్ట (కేశఖండన శాల)లోని స్నానపు గదుల్లో మహిళలు స్నానం చేస్తుండగా చూస్తున్న ఓ ఆకతాయిని కల్యాణకట్ట, సెక్యూరిటీ సిబ్బంది శుక్రవారం పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. స్వామివారి కల్యాణకట్టలో మొక్కుబడులు తీర్చుకున్న తరువాత మహిళలు ప్రత్యేకంగా ఉన్న గదుల్లో స్నానాలు చేసి, వ్రస్తాలు మార్చుకుంటారు.
గతనెల 25న ఓ భక్తురాలు స్నానం చేస్తుండగా బాత్‌రూం వెంటిలేటర్ (ఎగ్జాస్ట్) ఫ్యాన్ రంధ్రాల్లోంచి ఎవరో చూస్తున్నారని అక్కడి సిబ్బందికి చెప్పారు. పరిశీలించిన సిబ్బందికి ఎవరూ కనిపించలేదు. అలాగే గతనెల 27న మరో భక్తురాలు ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ యువకుడు కల్యాణకట్ట వెనుక భాగంలో తచ్చాడుతూ కనిపించాడు. వెంటనే దేవస్థానం, సెక్యూరిటీ సిబ్బంది ఆకతాయిని పట్టుకుని, దేహశుద్ధి చేశారు. ఫొటోలు, వీడియోలు తీశాడేమోనన్న అనుమానంతో అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, అందులో ఏమీ లేవు.
రెండు చోరీ కేసుల్లో నిందితుడు.. 
ఆకతాయి విజయనగరం జిల్లా తెర్ల మండలంలోని పెరుమాళ్ల గ్రామానికి చెందిన మైలపల్లి పైడిరాజుగా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే రెండు చోరీ కేసులు ఉన్నట్టు నిర్ధారించారు. కల్యాణకట్ట వద్ద జరిగిన ఘటనపై దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జీవీఎస్ పైడేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు బాత్‌రూమ్‌లలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగించి, వాటి రంధ్రాలు, దుస్తులు మార్చుకునే గదుల్లో కిటికీలను సైతం మూసివేశారు. కల్యాణకట్ట వెనుక నుంచి ఎవరూ లోపలికి వచ్చేందుకు వీలు లేకుండా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
