 
													గోశాలలో అనుమానాస్పద స్థితిలో ఆవు, దూడ మృత్యువాత
కరెంటు షాక్‌తో మృతి చెందాయంటున్న సిబ్బంది
కాదు పాముకాటు వల్లే అంటున్న అధికారులు
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. చిన్న తిరుపతిగా పేరున్న ఈ ఆలయం గోశాలలో గురువారం ఒక ఆవు, దూడ మృత్యువాత పడటం కలకలం రేపింది. కరెంటు షాక్‌తో మృతి చెందాయని సిబ్బంది, కాదు పాముకాటు వల్ల మృతి చెందాయని అధికారులు పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తున్నారు.
తిరుమల తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు భారీగా తరలివచ్చే ఈ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిత్యం శ్రీవారి దర్శనానంతరం కొందరు భక్తులు ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్త గోకులంలో గోపూజలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు దేవస్థానం సిబ్బంది గోసంరక్షణశాల నుంచి 9 ఆవులు, 9 దూడలను సప్త గోకులానికి తీసుకొస్తున్నారు.
తిరిగి సాయంత్రం ఆరు గంటలకు గోసంరక్షణశాలకు తీసుకెళ్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం సప్తగోకులానికి వచ్చిన ఆవులు, దూడల్లో ఒక జంట (ఆవు, దూడ) సప్తగోకులం వెనుకకు వెళ్లి, ఫ్లడ్‌లైట్లు ఉన్న హైమాస్ట్ పోల్ వద్ద పడిపోయాయి. వీటిని గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవి విద్యుదాఘాతం వల్ల మృతి చెందాయని కొందరు సిబ్బంది భావించగా, అవి పాము కాటు వల్లే మృతి చెందాయని అధికారులు చెబుతున్నారు.
ఘటనా స్థలంలోని ఫ్లడ్‌లైట్లకు విద్యుత్ సరఫరా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుందని, ఆ తరువాత టైమర్ కంట్రోల్ ద్వారా ఆటోమేటిగ్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయం ఉదయం 6 తరువాతేనని, దీన్ని బట్టి ప్రమాదానికి విద్యుదాఘాతం కారణం కాదని అధికారులు చెబుతున్నారు.
పోస్టుమార్టం నివేదికతోనే..పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఆవు, దూడ మృతికి కారణాలు తెలుస్తాయని మండల పశువైద్యాధికారి అంగర సురేష్ తెలిపారు. ఆవు, దూడ శరీర భాగాల నుంచి సేకరించిన నమూనాలను ఏలూరులోని యానిమల్ డిసీజ్ డయగ్నోస్టిక్ లేబొరేటరీ (ఏడీడీఎల్)కి పంపినట్టు చెప్పారు. అక్కడ నిర్ధారణ కాకపోతే విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (వీబీఆర్‌ఐ)కు పంపుతారని చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
