పాలమూరు, డిండికి గోదావరి నీళ్లు 

Godavari water for Palamuru and Dindi - Sakshi

కాళేశ్వరం ద్వారా నీటిని తరలించడం ఉత్తమం 

ప్రస్తుతం పాలమూరు, డిండికి నీటి లభ్యత 60 టీఎంసీలే 

ప్రభుత్వానికి రిటైర్డ్‌ ఇంజనీర్ల నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: నీటి కొరతను ఎదుర్కొంటున్న కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు గోదావరి నీటిని మళ్లించాలన్న ఆలోచనలకు ప్రభుత్వం పదును పెడుతోంది. గరిష్ట నీటిలభ్యత, సముద్రంలో ఏటా వృథాగా పోతున్న గోదావరిజలాలను మళ్లించి కృష్ణాబేసిన్‌ లోని పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు తరలించడం ద్వారా నీటికొరతను అధిగమించవ చ్చని భావిస్తోంది. దీనిపై ఇంజనీర్లు ఇదివరకే కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచగా, తాజాగా 100 టీఎంసీల గోదావరినీటిని పాలమూరు, డిండిలకు తరలించే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. దీనితో ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయి నీటి లభ్యత అందుబాటులో ఉంచవచ్చని పేర్కొన్నారు. 

గోదావరి పరిష్కారం.. 
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల పాటు 120 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 90 టీఎంసీ నీటిని పాలమూరు–రంగారెడ్డికి, మరో 30 టీఎంసీ డిండికి మళ్లించాలని నిర్ణయించారు. పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీల నీటితో 12.3 లక్షల ఎకరాలకు, డిండికి 30 టీఎంసీ నీటితో 3.41లక్షల ఎకరా లకు నీరివ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, సాధారణంగా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు మించి నీరివ్వడం సాధ్యంకాదు. ఈ నేపథ్యం లో 90 టీఎంసీలతో 12.3 లక్షల ఎకరాలకు నీరివ్వ డం దాదాపు అసాధ్యం. కృష్ణాలో 120 వరద రోజుల ఆధారంగా లెక్కలు కట్టగా, కృష్ణాబేసిన్‌లో వరద 30 రోజులకు మించి ఉండట్లేదు. ఈ వరద రోజుల్లో 60 టీఎంసీలకు మించి నీటిని తీసుకోలేం. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు 100 టీఎంసీల మేర నీటి కొరత ఏర్పడుతోంది. ఈ నీటి కొరతను గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా మళ్లించడం ద్వారానే తీర్చుకోగలమని హైదరాబాద్‌ రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం తేల్చింది.  

ఇలా మళ్లించొచ్చు..
కాళేశ్వరంలో భాగంగా ఉన్న సంగారెడ్డి కెనాల్‌ కాల్వ నుంచి పాలమూరు లో భాగంగా ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌కు రోజుకు 0.8 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజనీర్ల సంఘం పేర్కొంది. దీనికోసం 2.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని సూచించింది. దీనిద్వారా కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద నిర్ణయించిన 4.13 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మొత్తంగా 7 లక్షల ఎకరాలకు నీరి వ్వొచ్చని పేర్కొంది. కాళేశ్వరంలో చివరిదైన బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించొచ్చని సూచించింది. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపింది. ఏదుల నుంచి పాత డిండి వరకు కృష్ణా నీటిని తరలించే పనులకు అయ్యే వ్యయం కన్నా, శివన్నగూడెం ద్వారా డిండి ఎత్తిపోతలకు గోదావరి నీటిని తరలించే వ్యయం తక్కువగా ఉంటుందని తేల్చిచెప్పింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించి, చర్చించాక నిర్ణయం చేసే అవకాశం ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top