80 మేకలు సజీవ దహనం

goats were died due to unexpected fire accident - Sakshi

ప్రమాదవశాత్తు మేకల దొడ్డికి నిప్పు

ఆమనగల్లు : ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ పరిధిలోని చిన్నతండాలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు మేకలదొడ్డికి నిప్పంటుకోవడంతో  దొడ్డిలో ఉన్న 80 మేకలు సజీవ దహనమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. చిన్నతండాకు చెందిన పాత్లావత్‌ గోప్యానాయక్‌ వ్యవసాయ భూమి లేకపోవడంతో మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాడు. కాగా బుధవారం రాత్రి మేకలను మేపి చిన్నతండా సమీపంలోని వాగు వద్ద ఉన్న మేకల దొడ్డిలో ఉంచి ఇంటికొచ్చాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు దొడ్డికి నిప్పంటుకోవడంతో అందులో ఉన్న 80 మేకలు సజీవదహనం అయ్యాయి.

మంటలకు తాళలేక మేకలన్నీ ఒకదానిపై ఒకటి పడి కాలిన తీరు చూసి పలువురు రైతులు కంటతడి పెట్టారు. మేకల పెంపకం ఆధారంగా జీవిస్తున్న గోప్యానాయక్‌ కుటుంబం మేకల మృతితో వీధిన పడినట్లు అయ్యింది. విషయం తెలియడంతో గురువారం ఉదయం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, ఆమనగల్లు జెడ్పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోప్యానాయక్‌ను పరామర్శించి వ్యక్తిగతంగా కొంత ఆర్థికసాయం అందించారు.

సంఘటనా స్థలాన్ని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్యానాయక్, ఎంపీటీసీ సభ్యురాలు వల్లి పంతునాయక్, సర్పంచ్‌ శ్వేతాఆనంద్‌నాయక్, మాజీ సర్పంచ్‌లు శ్రీరాములు, హుమ్లానాయక్, కడ్తాల మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, ఆమనగల్లు ఎస్సై మల్లీశ్వర్‌లు పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు గోప్యానాయక్‌ కోరుతున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top