ఉక్కుపాదం | GHMC Enforcement Teams to remove Encroachments | Sakshi
Sakshi News home page

ఉక్కుపాదం

Jul 1 2014 1:40 AM | Updated on Sep 2 2017 9:36 AM

అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటూ జీహెచ్ ఎంసీ అమర్చిన ఫ్లెక్సీ

అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటూ జీహెచ్ ఎంసీ అమర్చిన ఫ్లెక్సీ

గ్రేటర్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకునేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

* అక్రమ నిర్మాణాలకు ఆదిలోనే అడ్డుకట్ట
* రంగంలోకి జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు
* హైదరాబాద్ పరిధిలోని 18 సర్కిళ్లకు 18 టీమ్స్
 
సాక్షి, హైదరాబాద్:  గ్రేటర్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకునేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. వాటి నివారణకు ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్’ను ఏర్పాటు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ రంగంలోకి దిగి అడ్డుకుంటాయి. తొలిదశలో సర్కిల్‌కి ఒకటి చొప్పున గ్రేటర్‌లోని 18 సర్కిళ్లకు వెరసి 18 ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్‌ల పనితీరును జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ సీసీపీ లేదా సీపీలు పర్యవేక్షిస్తారు. సర్కిల్‌లో ఉండే ఏసీపీ నేతృత్వంలో టీమ్ పనిచేస్తుంది. ఒక్కో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌కు ఆరుగురు సిబ్బంది ఉంటారు.
 
అక్రమ నిర్మాణాల ఫిర్యాదులే అధికం..
జీహెచ్‌ఎంసీకి వివిధ వర్గాల నుంచి, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందినవి.. అందులోనూ అక్రమ నిర్మాణాలవే అధికం. వారం వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ప్రజావాణి’లో సైతం అక్రమ నిర్మాణాల ఫిర్యాదులే ఎనభై శాతానికి పైగా ఉంటున్నాయి. వీటి పరిష్కారానికి ఒకటి రెండురోజుల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి, తగిన వ్యూహం, కార్యాచరణ రూపొందిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. నాలాలు, చెరువుల భూముల్లో నిర్మాణాలు జరిపితే కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. తొందరపాటు చర్యలకు దిగబోమని, న్యాయనిపుణుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
ఎన్ కన్వెన్షన్‌పై అక్రమ నిర్మాణ  బోర్డు....
సర్వే చేసిన అధికారుల బృందం తమ్మిడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ ఉందని తేల్చిన విషయం తెలిసిందే. ఎన్‌కన్వెన్షన్ లోపల మార్కింగ్ అధికారులు తాజాగా ‘అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్’ అని రాశారు. గురుకుల్ ట్రస్టులోని నిర్మాణాలపైనా ఇదే తరహాలో రాస్తున్నారు. కాగా, తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసేందుకు సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని సోమవారం కలిశారు.
 
చార్జీలు మూడు రెట్లు
గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని భవనాల్లో ఇప్పటికే కరెంటు, తాగునీటి  సదుపాయం పొందుతున్న వారికి జూలై నెల నుంచి మూడు రెట్ల బిల్లులు అందనున్నాయి. జీహెచ్‌ఎంసీ యాక్ట్ మేరకు అక్రమ నిర్మాణాలు జరిపిన వారికి మూడు రెట్లు బిల్లులు వసూలు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement