
సాక్షి, హైదరాబాద్: అనధికార లెక్కల ప్రకారం చూస్తే...ఇప్పటికే 7 లక్షల ఎకరాల అటవీభూమి ఆక్రమణలకు గురైనట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోనూ రోజురోజుకు అటవీ ఆక్రమణలు పెరుగుతుండగా...దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆక్రమణలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రాల వారీగా ఈ ఆక్రమణలకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం పంపించాలని ఆదేశించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఆక్రమణలు వెలుగులోకి వస్తున్న సందర్భంలోనే...గతనెలలో 8న, మళ్లీ 19న అరణ్యభవన్ నుంచి జిల్లాల వారీగా ఆక్రమణలకు సంబంధించి డేటాను పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖకు పంపించాల్సి ఉండటంతో జిల్లా అటవీ అధికారులకు అర్జెంట్ ఈ–మెయిల్‌ను పంపించినట్టు సమాచారం.
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కేసుకు సంబంధించి అటవీ ఆక్రమణల వివరాలు సమర్పించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 31 నాటికి ప్రతీ జిల్లాలో చోటుచేసుకున్న ఆక్రమణలకు సంబంధించిన సమాచారం, గత ఐదేళ్లలో ఆక్రమణలపై తీసుకున్న చర్యలు, జూలై 31 నాటికి జిల్లాల వారీగా నష్టపోయిన అటవీ శాతం తదితర వివరాలను పంపించాలని అటవీశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఆయా కమిటీల్లో ఎవరెవరు ఉంటారంటే....
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కొద్దిరోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... జిల్లా స్థాయిలో కలెక్టర్ల చైర్మన్‌గా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభ్యుడిగా, జిల్లా అటవీ అధికారి సభ్యకార్యదర్శిగా, అసిస్టెంట్ డైరెక్టర్/ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) సభ్యుడిగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) ఏర్పాటయ్యాయి. ఈ సిట్‌లు రెవెన్యూశాఖ అ«దీనంలోని ఏదైనా రిజర్వ్ ఫారెస్ట్‌లో వ్యక్తులు లేదా సంస్థలకు అటవీయేతర అవసరాలకు భూమిని కేటాయించిన అంశాన్ని పరిశీలిస్తాయి.
రిజర్వ్ ఫారెస్ట్‌లలో వ్యక్తులు, సంస్థలకు కేటాయించిన అటవీయేతర అవసరాలకు కేటాయించిన అటవీ భూమిని స్వా«దీనం చేసుకొని, దానిని అటవీశాఖకు అప్పగించేందుకు – ప్రతీ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓ చైర్మన్‌గా, డీఎస్పీ సభ్యుడిగా. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సభ్యకార్యదర్శిగా, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్‌సర్వే (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) సభ్యుడిగా ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.
రాష్ట్రంలో 26.9 లక్షల హెక్టార్లలో అడవులు
రాష్ట్రంలో మొత్తం కలిపి 26.9 లక్షల హెకార్ల విస్తీర్ణంలో (24 శాతం) అడవి ఉంది. అందులో 2.94 లక్షల హెక్టార్లు (దాదాపు 11 శాతం) అన్యాక్రాంతమైనట్టు అటవీశాఖ రికార్డుల్లో ఉన్నట్టు తెలిసింది. వాస్తవానికి ఈ ఆక్రమణలు మరో మూడు శాతం వరకు ఉంటాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న అడవి కూడా ఎక్కువగా కొండలు, గుట్టలపైనే మిగిలిందని, అధిక శాతం దట్టమైన అడవి ఇప్పటికే కనుమరుగవుతోందని, ఇంకా ఉపేక్షిస్తే అసలు అడవి అనేదే నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద...
2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగి్నషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్‌ఓఎఫ్‌ఆర్) కింద 2017 చివరి నాటికి మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. ఆయా విభాగాల వారీగా చూస్తే...
» 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు), సామూహికంగా (కమ్యూనిటీ) 3,427 క్లెయిమ్స్ (4,70,605 ఎకరాలకు) రూపంలో దరఖాస్తులు అందాయి. వాటిలో వ్యక్తిగత క్లెయిమ్స్‌లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. సామూహికంగా 721 క్లెయిమ్స్‌కు 4,54,055 ఎకరాలకు హక్కుపత్రాలు అందజేశారు.
» 80.890 వ్యక్తిగత క్లెయిమ్స్ (2,90,589 ఎకరాలు) 1,682 కమ్యూనిటీ క్లెయిమ్స్ (11,988 ఎకరాల)ను తిరస్కరించారు.
» 8,723 వ్యక్తిగత క్లెయిమ్స్(40,033 ఎకరాలు)1,024 కమ్యూనిటీ క్లెయిమ్స్ (4,562 ఎకరాలు) పెండింగ్‌లో ఉన్నట్టుగా అటవీ, ఎస్టీ సంక్షేమ శాఖల రికార్డులను బట్టి స్పష్టమవుతోంది.