పెనాల్టీ పడుద్ది

GHMC Challans to Road Excavations - Sakshi

రోడ్లను పాడుచేస్తే ప్రభుత్వ విభాగాలకూ జరిమానా

అంచనా వ్యయంలో 10 శాతం విధింపు

ఎలాంటి సంస్థనైనా ఉపేక్షించేది లేదు...

జీహెచ్‌ఎంసీ నిర్ణయం

సాక్షి,సిటీబ్యూరో: రోడ్లమీద చెత్త , డెబ్రిస్‌ వంటివి వేసినా.. బహిరంగ మూత్ర విసర్జన చేసినా జరిమానాలు విధిస్తోన్న జీహెచ్‌ఎంసీ త్వరలో.. రోడ్లను ఇష్టానుసారం తవ్వి వ్యర్థాలను అలాగే వదిలేస్తున్న ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు ఏజెన్సీలకు సైతం పెనాల్టీలు విధించనుంది. తమ పనుల కోసం హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌), హైదరాబాద్‌ రోడ్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌), వాటర్‌ సప్‌లై అండ్‌ సివరేజి బోర్డు (జలమండలి)రోడ్లను తవ్వుతున్నాయి.

వెలువడే వ్యర్థాలను  ఎక్కడికక్కడ అలాగే వదిలేస్తున్నాయి. తమ పనులు ముగిశాక తిరిగి పూడ్చివేసేందుకు ఎంతో సమయం పడుతోంది. అప్పటి వరకు ఆ వ్యర్థాలు అలాగే ఉంటున్నాయి. అంతేకాదు.. పూడ్చివేతల తర్వాత సైతం వ్యర్థాలతో నగర అందం దెబ్బతింటోంది. ఓడీఎఫ్‌ ర్యాంకింగ్‌లో.. స్వచ్ఛ భారత్‌ ర్యాంకింగ్స్‌లో నగరం మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందంజలో ఉంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం నగరాన్ని అందవిహీనంగా మారుస్తున్నాయి. గ్లోబల్‌ సిటీగా ఎదుగుతున్న నగరానికి వచ్చే పర్యాటకులూ పెరుగుతున్నారు. నగరంలో రోడ్ల  వెంబడి ఈ వ్యర్థాలు అందవిహీనం చేస్తుండగా, వ్యర్థాలుండటంతో పారిశుధ్య చర్యలు సైతం అధ్వాన్నంగా మారుతున్నాయి.

కొత్తగా వచ్చేవారెవరైనా తొలుత చూసేది రోడ్లనేనని.. వాటిని అద్దాల్లా తీర్చిదిద్దాలని భావించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ఆమేరకు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వ్యర్థాలను తొలగించని వారు ఎవరైనా సరే.. ప్రభుత్వ విభాగాలే అయినా సరే నగర అందాన్ని చెడగొడితే పెనాల్టీలు విధించాలని భావించారు. అలాంటి వారిని గుర్తించి రోడ్డు కటింగ్‌ చార్జీల అంచనాలో 10 శాతం జరిమానాగా విధించాలని భావించారు. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించారు. శనివారం జరిగే జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాక ప్రభుత్వ అనుమతి కోసం పంపనున్నారు.

కేబుల్‌ సంస్థలతో మరింత అధ్వానం..
పలు కేబుల్‌ సంస్థలు తమ అవసరాల కోసం రహదారులను తవ్వి.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో రహదారి అందం మొత్తం దెబ్బతినడమే కాకుండా అది జీహెచ్‌ఎంసీ ఇమేజ్‌నూ దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో పెనాల్టీ చర్యలకు సిద్ధమయ్యారు. ఉదాహరణకు రోడ్‌ కటింగ్‌లకు చ.మీ.కు రూ.800 చార్జి కాగా, ఇలా వ్యర్థాలను వదిలేస్తే అందులో పది శాతం అంటే..రూ.80 పెనాల్టీగా వసూలు చేస్తారు.  హైదరాబాద్‌ రహదారుల్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ చర్యలని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ (మెయింటనెన్స్‌) జియాఉద్దీన్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top