బయోడైవర్సిటీ ప్రమాదంపై ‘సీన్‌ రీ క్రియేట్‌’

GHMC Action Plan On Biodiversity Flyover Accident - Sakshi

105 కి.మీ వేగంతో జీహెచ్‌ఎంసీ కారు ప్రయాణం 

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా నేర సంఘటనల్లో అవసరం మేరకు పోలీసులు ‘సీన్‌ రీ క్రియేట్‌’ చేస్తుంటారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో అదే ప్రక్రియను అవలంబించారు. వంతెనపై వాహనం ఎంత వేగంతో వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవడంతో పాటు స్పీడ్‌ను కంట్రోల్‌ చేయవచ్చా లేదా అనేది గుర్తించేందుకు తమ డ్రైవర్‌ను తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసి పరిశీలించారు. ఆదివారమే జరిగిన ఈ ‘రీ కన్‌స్ట్రక్షన్‌’ గురించి విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం ప్రమాదం జరగడంతో వివిధ అంశాల పరిశీలనకు ఆదివారం కూడా అక్కడకు వెళ్లిన ఇంజినీరింగ్‌ అధికారులకు వారి డ్రైవర్‌ ఆసక్తి కొద్దీ ‘సార్‌.. అంత స్పీడ్‌తో వెళ్లినా జాగ్రత్తగా ఉంటే  ఆపవచ్చు. నేను మన కారు నడుపుతా’ అన్నాడు. దాంతో ఒక్కసారిగా ఆలోచనల్లో పడ్డ ఇంజినీర్లు ఫ్లై ఓవర్‌పై అంత స్పీడ్‌తో వెళ్లవద్దు కదా.. అనుకున్నప్పటికీ డ్రైవర్‌ నైపుణ్యం, జాగ్రత్తగా వాహనం నడిపే తీరు గురించి తెలిసి ఉండటంతో వాటిని పరిగణనలోకి తీసుకొని సరే అన్నారు. అంతకుముందే కారు ప్రమాదం జరిగిన తీరు.. ఎక్కడ క్రాష్‌ బారియర్‌ను ఢీకొని ముందుకు వెళ్లిందీ.. తదితరమైనవి చూసిన డ్రైవర్‌ సరిగ్గా ఆ ప్రదేశానికి చేరుకునేందుకు కొన్ని క్షణాలు ముందుగా కారును ఆపే ప్రయత్నం చేయగా ఆగిపోయింది.

ఆ సందర్భంలో డ్రైవర్‌ ఆసక్తిని కాదనలేకపోయిన అధికారులు వాహనం దిగాక డ్రైవింగ్‌ సామర్థ్యం, నైపుణ్యం ఎంతగా ఉన్నప్పటికీ, ఎక్కడా పరిమితి మించిన వేగంతో వెళ్లొద్దని, నిబంధనలు, సైనేజీల్లోని సూచనల మేరకే నడచుకోవాలని అధికారులు తమ డ్రైవర్‌ను హెచ్చరించినట్లు సమాచారం. శనివారం ప్రమాదానికి గురై బోల్తా పడ్డ కారు ఫోక్స్‌ వాగన్‌ కాగా, అధికారులు తమ ఇన్నోవా వాహనంలో వెళ్లారు. ఇదిలా ఉండగా, అంత వేగంతో వాహనాన్ని నడిపిన వ్యక్తి కనీసం బ్రేక్‌ వేసే ప్రయత్నం చేసినట్లు కూడా కనిపించలేదని సీసీఫుటేజీల్లోని దృశ్యాల ఆధారంగా అధికారులు భావించినట్లు సమాచారం. బ్రేక్‌ వేస్తే వాహనం వెనుక ఉండే ఎరుపురంగు లైట్లు వెలుగుతాయని, సీసీ ఫుటేజీ దృశ్యాల్లో అది కనిపించకపోవడంతో బ్రేక్‌ కూడా వేయలేదని భావిస్తున్నారు. ఒకవేళ బ్రేక్‌ వేయబోయి ఆందోళనలో ఎక్సలేటర్‌ తొక్కి ఉంటాడని అభిప్రాయపడ్డట్లు సమాచారం. 

అధ్యయనంలో నిపుణుల కమిటీ 
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వతంత్ర నిపుణుల కమిటీ అధ్యయనంలో వెల్లడయ్యే అంశాల వారీగానే అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీ ఫ్లై ఓవర్‌కు సంబంధించిన డిజైన్లు, ప్లాన్లు జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి తీసుకుని పని ప్రారంభించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top