మనకేదీ రక్షణ

Ghat Roads Problems In Rangareddy - Sakshi

రెండేళ్ల క్రితం ఘాట్‌ రోడ్డు మీదుగా అనంతగిరి నుంచి కేరెళ్లికి వెళ్తున్న బస్సు బ్రేక్‌లు ఫెయిల్‌ అయ్యాయి. బస్సు అదుపు తప్పి ఒక్కసారిగా కుడివైపున ఉన్న ఘాట్‌లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ఓ చెట్టును ఢీ కొట్డడంతో వేగం తగ్గి అక్కడే ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అనంతగిరి (రంగారెడ్డి): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. నిత్యం తాము రాకపోకలు సాగించే రూట్లో ఉన్న ఘాట్‌ రోడ్లను తలుచుకుని అభద్రతా భావానికి గురయ్యారు. వికారాబాద్‌ పట్టణానికి సమీపంలో అనంతగిరి వద్ద ఎత్తైన ఘాట్‌ రోడ్లు ఉన్నాయి. వీటి కింది లోయలు సుమారు 1,500 అడుగుల లోతులో ఉంటాయని అంచనా. ఇక్కడ ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు చర్చించుకున్నారు. ఈ మధ్య కాలంలో అనంతగిరికి శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఈ దారిలో ఎత్తైన ఘాట్‌ రోడ్లు ఉన్నాయి. వీటికి రెండు మూడు చోట్ల మాత్రమే సైడ్‌వాల్స్, రక్షణ రాళ్లు ఉన్నాయి.

అనేక చోట్ల ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోలేదు. ఒకవేళ వాహనాలు అదుపుతప్పితే లోయలోకి దూసుకుపోవాల్సిందే. ఇప్పటికే పలు ట్యాంకర్లు, లారీలు ఇక్కడ బోల్తా పడ్డ ఘటనలు అనేకం ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఘాట్‌ రోడ్డు మీదుగా అనంతగిరి నుంచి కేరెళ్లికి వెళ్తున్న బస్సు బ్రేక్‌లు ఫెయిల్‌ అయ్యాయి. ఎంతకీ అదుపు కాకపోవడంతో ఒక్కసారిగా కుడివైపున ఉన్న ఘాట్‌ లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు ఓ చెట్టు ను ఢీకొట్డడంతో వేగం తగ్గి అక్కడే నిలిచిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 3 నెలల క్రితం అనంతగిరి– కేరెళ్లి మొదటి ఘాట్‌లో ఏర్పాటు చేసిన సైడ్‌వాల్‌ను ఓ అంబులెన్స్‌ ఢీకొట్టింది.

వేగం తక్కువగా ఉండటంతో అక్కడే ఆగిపోయింది. ఏమాత్రం స్పీడ్‌ ఉన్నా వాహనం లోయలో పడిపోయేదే. ఇక్కడ దెబ్బతిన్న సైడ్‌వాల్‌కు ఇప్పటికీ మరమ్మతు చేసిన పాపాన పోలేదు. 6 ఏళ్ల క్రితం ఈ ఘాట్‌ రోడ్డును కొంతమేర విస్తరించినప్పటికీ ఎలాంటి రక్షణ గోడలు నిర్మించలేదు. అనుకోని సంఘటన ఏదైనా అధిక   ప్రాణనష్టం తప్పదని ప్రయాణికులు, జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘాట్‌ రోడ్లపై గతంలో ఆర్టీసీ బస్సులు ఎన్నోసార్లు ఆగిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి లోయ అంచులవరకూ వెళ్లాయి. పలుమార్లు డ్రైవర్ల అప్రమత్తతతో పెను ప్రమాదాలే తప్పాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఘాట్‌రోడ్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top