గణేశ్‌ ఉత్సవాలకు 127 ఏళ్లు

Ganesh Festival Celebrated In Bhainsa Town Since 101 Years - Sakshi

కుభీర్‌లో 114 ఏళ్లకుపైగానే..

భైంసా ఉత్సవాలకు 101 ఏళ్లు

పుణేలో శ్రీకస్బ గణపతిని  ప్రతిష్టించిన బాలగంగాధర్‌ తిలక్‌

1893లో మహారాష్ట్రలో ప్రారంభం

భైంసా (ముథోల్‌): దేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగుతున్నకాలమది. స్వాతంత్రం కోసం జాతీయ నాయకులు పోరాడుతున్నారు. బాలగంగాధర్‌ తిలక్‌ సైతం అదేబాటలో నడిచాడు. అందరినీ సమైక్యంగా కలుపుకుపోవాలన్న ఆలోచనతో ముందుకు కదిలాడు. ఆ రోజుల్లో ఆంగ్లేయులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. నలుగురు ఒక చోట కలుసుకునే అవకాశంలేదు. ఆ రోజుల్లో ఇళ్లలోనే గణపతి పూజలు జరిగేవి. అలాకాకుండా ఏటా గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్టిస్తే అంతా కలిసి ఒకేచోట ఉత్సవాలు జరుపుకుంటారని అనుకుని ఆ దిశగా అడుగులు వేశాడు. 1893లో బాలగంగాధర్‌ తిలక్‌ మహారాష్ట్రలోని పుణేలో శ్రీ కస్బ గణపతిని ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించాడు. అప్పటి నుంచి 127 ఏళ్లుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  

కుభీర్‌కు వచ్చి...
ఆ సమయంలో ముథోల్‌ ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండేది. ముథోల్‌ ప్రాంతమంతా నాందేడ్‌ జిల్లా పరిధిలోకి వచ్చేది. బాలగంగాధర్‌ తిలక్‌ దేశమంతా పర్యటిస్తూ ఇప్పటి నిర్మల్‌  జిల్లాలోని ముథోల్‌ నియోజకవర్గ పరిధిలో గల కుభీర్‌కు చేరుకున్నారు. అప్పుడు కుభీర్‌ను పాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్‌కు బాలగంగాధర్‌తిలక్‌ దగ్గరి బంధువు. 1905లోనే భైంసాకు వచ్చిన బాలగంగాధర్‌తిలక్‌ పట్టణానికి చెందిన నారాయణ్‌వాగ్‌తో సమావేశమయ్యారు. అప్పుడే కుభీర్‌లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కుభీర్‌నుపాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్‌ గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించేవారు. 1950 నుంచి 40ఏళ్లపాటు కుభీర్‌కు చెందిన వైద్యనాథ్‌ ఉత్సవాల నిర్వాహణను చూసుకున్నారు. నేడు గ్రామస్తులు ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నారు.

భైంసా పట్టణంలో 101 ఏళ్లుగా..
భైంసాలో 1919లో సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మందిరంలో మొదటిసారిగా నారాయణ వాగ్‌ సమక్షంలో ఉత్సవాలు ప్రారంభించారు.101 ఏళ్ళుగా గోపా లకృష్ణ మందిరంలో గణేశ్‌ ఉత్సవాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిమజ్జనం రోజున ఇక్కడే పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. 1921లో హతిగణేశ్‌ మండలి ఉత్సవాలను ప్రారంభించింది. నేడు భైంసా పట్టణంలో 100కు పైగా మండళ్లు గణేశ్‌ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. అప్పట్లో అంతా కలిసి భజనలు చేస్తూ ఒకేచోట ఉత్సవాలు చేసుకునేవారు. నేడు గణేశ్‌ మండళ్ల సంఖ్య 100కు పైగానే చేరింది.

ఫోటోలు ‘సాక్షి’కి పంపండి...
నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను  ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top