దిశ ఎన్‌కౌంటర్‌: మృతదేహాలకు ఎంబామింగ్‌

Gandhi Mortuary Until Further Orders Were Issued On Bodies Of Disha Accused - Sakshi

గాంధీ మార్చురీలోనే మృతదేహాలు

సాక్షి, గాంధీ మార్చురీ: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాలను తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు గాంధీ మార్చురీలోనే భద్రపరచాలనే హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ మార్చురీ వైద్యులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. మృతదేహాలు కుళ్లిపోకుండా ఎంబామింగ్‌ (రసాయనపూత) చేసి ప్రత్యేక ఫ్రీజర్‌ బాక్సుల్లో భద్రపరిచారు. మనిషి మరణించిన 24 గంటల తర్వాత పలు రకాల వైరస్, బాక్టీరియాలు చేరడంతో మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమవుతుందని, మృతదేహాలను భద్రపరిచే విధానం పూర్వకాలం నుంచే అవలంబిస్తున్నారని పలువురు వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే మృతులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు ఎంబామింగ్‌ ప్రక్రియ చేపట్టారు. రక్తనాళాల ద్వారా సుమారు రెండు గ్యాలన్ల ఫార్మల్‌ డీహైడ్‌ అనే ద్రావకాన్ని ఒక మృతదేహాంలోకి ఎక్కిస్తారు. రక్తనాళాల్లోకి ద్రావకం పంపింగ్‌ చేసేందుకు ప్రత్యేక వైద్యయంత్రాన్ని వినియోగిస్తారు.

ఒకసారి ఎంబామింగ్‌ చేస్తే రెండు వారాల పాటు మృతదేహాలు పాడైపోకుండా తాజాగా ఉంటాయని సంబంధిత వైద్యులు తెలిపారు. ఎంబామింగ్‌ చేయకుండా ఫ్రీజర్‌బాక్స్‌లో పెడితే శీతలానికి గడ్డకట్టుకుపోతాయి తప్పితే తాజాగా ఉండవని వివరించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి నివేదికలు అందించినప్పటికీ కోర్టు ఆదేశిస్తే మరోమారు పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలుగా మృతదేహాలు తాజాగా ఉండేందుకు ఎంబామింగ్‌ ప్రక్రియ చేపట్టి ఫ్రీజర్‌ బాక్సుల్లో భధ్రపరిచినట్లు సంబంధిత వైద్యులు వెల్లడించారు. గాంధీ మార్చురీ వద్ద ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, సుమారు 40 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టి మూడంచెల భద్రతను కొనసాగిస్తున్నారు.   

బుల్లెట్ల కోసం గాలింపు 
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ స్థలంలో వెతికిన పోలీసులు  
షాద్‌నగర్‌ టౌన్‌: దిశ హంతకులను ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశాన్ని పోలీసులు శనివారం మరోసారి తనిఖీ చేశారు. బుల్లెట్ల కోసం విస్తృతంగా గాలించారు. 8 మంది సభ్యులతో కూడిన పోలీసుల బృందం బుల్లెట్లను వెతికేందుకు ప్రత్యేక మెటల్‌ డిటెక్టర్లను ఉపయోగించింది. ఘటన జరిగిన రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని ప్రత్యేక పోలీసు బృందం తనిఖీ చేసింది. సుప్రీంకోర్టులో బుల్లెట్లకు సంబంధించిన వివరాలు అడిగిన నేపథ్యంలో పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో బుల్లెట్ల కోసం గాలించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో బుల్లెట్లు లభించాయా.. లేదా అనే విషయాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఘటనా స్థలానికి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top