నయా ఫ్యూడలిజం నశించాలి..

Gaddar Election Campaign In Ramagundam From Congress In 2018 - Sakshi

రామగుండంలో గద్దర్‌ ఆటా పాటా

గోదావరిఖని(రామగుండం) : నయా ఫ్యూడలిజం నశించాలి.. ఓట్ల విప్లవం వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ప్రజాయుద్ధనౌక గద్దర్‌ ఆటాపాటా ఆకట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ సోమవారం ఏర్పాటు చేసిన సభలో మహాకూటమి అభ్యర్థి రాజ్‌ఠాగూర్‌ మక్కాన్‌సింగ్‌ తరఫున ఆయన ప్రచారం చేశారు. చిన్నారులతో కలిసి గతంలో జరిగిన అన్యాయాలను నాటిక రూపంలో వివరించారు. గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని.. జనాభలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీలో మంత్రి పదవి ఒక్కరికి కూడా దక్కలేదని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని బిర్యాని పెట్టి బుజ్జగించారన్నారు. గొర్రెలు, తోకలు, ఈకెలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదవి మాత్రం బీసీలకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నారని అన్నారు. 

సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో కారుణ్యం లేకుండా కఠినత్వంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రామగుండం ఉద్యమ గుండం, వెలుగు గుండాన్ని ప్రస్తుతం చీకటి మయం చేశారని విమర్శించారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాజ్‌ఠాగూర్‌మక్కాన్‌సింగ్‌ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగస్వామి, హర్కర వేణుగోపాల్, కౌశిక్‌హరి, బాబర్‌ సలీంపాషా, గుమ్మడి కుమారస్వామి, జీవీరాజు, విజయ్, జిమ్మిబాబు, అఫ్జల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top