
ప్రసాద్ షి‘కారు’
కారెక్కడం దాదాపు ఖాయమైంది. గురువారం వికారాబాద్‌లో పార్టీ ముఖ్యులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపిన ప్రసాద్ కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయానికి వచ్చారు
- మండలి ఎన్నికల వేళ
- కాంగ్రెస్‌కు మాజీ మంత్రి ఝలక్
- పార్టీ మార్పుపై సమాలోచన
- గులాబీ గూటికి చేరడం ఇక లాంఛనమే..
- ముహూర్తమే తరువాయి
- కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
- తగిలింది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్
కారెక్కడం దాదాపు ఖాయమైంది. గురువారం వికారాబాద్‌లో పార్టీ ముఖ్యులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపిన ప్రసాద్ కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీ మారడంపై సమావేశంలో అభిప్రాయాలు తెలుసుకున్న ఆయన భవిష్యత్తు కార్యాచరణను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తానని చెబుతున్నప్పటికీ, టీఆర్‌ఎస్‌లో చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఈ నెల 23లోపు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్న ఆయన ముహూర్తం ఖరారు చేసుకునే అంశంపై గులాబీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రసాద్‌కుమార్ ‘చేయి’వ్వడం ఖాయం కావడంతో కాంగ్రెస్ నాయకత్వం డైలమాలో పడింది. శాసనమండలి ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం ఆ పార్టీకి మింగుడు పడడంలేదు. ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగిస్తుందని అంచనా వేసినా... సీనియర్ నేతకు గాలం వేస్తున్నదని విషయాన్ని పసిగట్టలేకపోయామని అంటోంది. ఎమ్మెల్సీ సీటును ఆఫర్ చేసినప్పటికీ సున్నితంగా తిరస్కరించిన ప్రసాద్... తెర వెనుక జరుపుతున్న మంతనాలను తెలుసుకోలేకపోయామని మాజీ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకరించిన తనకు కూడా మాట మాత్రంగా చెప్పకపోవడం ఒకింత బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంత ఇష్టం.. కొంత కష్టం!
ప్రసాద్‌కుమార్ బాట అనుసరించే అంశంపై గురువారం జరిగిన సమావేశంలో భినాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కాంగ్రెస్‌కు దూరం కావద్దని, మరోసారి పునరాలోచన చేయాలని కొందరు నేతలు అభిప్రాయపడగా, మరికొందరు నేతలు మాత్రం నిధులు రావాలన్నా, పనులు కావాలన్నా గులాబీ కండువా కప్పుకోవాల్సిందేనని తేల్చేశారు. ఈ క్రమంలో పార్టీ మారే అంశంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలను కూడా ఒప్పించి తన దారిన తీసుకెళ్లాలని ప్రసాద్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అందరి మనోభావాలను తెలుసుకున్న ఆయన.. తన అంతరంగాన్ని మాత్రం బయటపెట్టలేదు. అయితే, శుక్రవారం మరికొందరు ముఖ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌లో తనకిచ్చే ప్రాధాన్యం, పదవులపై స్పష్టమైన హామీని ప్రసాద్ ఇప్పటికే తీసుకున్నారు.
ఈనెల 23 నుంచి ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో చంఢీయాగం నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుతున్నందున.. ఆ లోపే చేరిక ఉంటుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
పార్టీ మారుతున్నా..: ప్రసాద్
‘కార్యకర్తల అభీష్టం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడడం బాధకరమే అయినా.. నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల బాగోగులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చా. శుక్రవారం శ్రేయోభిలాషులతో అభిప్రాయాలను కూడా తెలుసుకొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తా. ఆ త ర్వాత ఒకట్రెండు రోజుల్లో గులాబీ తీర్థం పుచ్చుకుంటా’