భద్రాచలం పట్టణంలోని కరకట్టపై ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన.......
► చంపాలనుకున్నాడు భద్రాచలంలో భార్యపై హత్యాయత్నం
► మంచిర్యాల వాసి నిందితుడు
భద్రాచలం టౌన్(ఖమ్మం) : భద్రాచలం పట్టణంలోని కరకట్టపై ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అక్కడి పోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని మంచిర్యాలకు చెందిన యలకుర్తి సంతోష్, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన సంతోషి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత కట్నంగా డబ్బు కావాలని సంతోషిని అడగటంతో ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. తన దగ్గర బంధువైన శివతో కలిసి భద్రాచలం రామయ్యను దర్శించుకునేందుకని మంగళవారం భద్రాచలం చేరుకున్నారు.
తెల్లవారుజామునే స్వామి వారి దర్శనం చేసుకుందామనుకుని ఆ రాత్రే ఆమెను కరకట్ట వద్దకు తీసుకెళ్లి ఇద్దరు కలిసి గొంతు కోశారు. చనిపోయిందనుకుని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత కొంత సమయానికి స్పహలోకి వచ్చిన ఆమె స్థానికుల సహాయంతో భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్సను అందించారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇక్కడికి చేరుకుని ఆమెను వరంగల్ ఆస్పత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.