25న కన్నెపల్లిలో వెట్‌రన్‌!

Focus on water availability for motor run in Kannepalli - Sakshi

సీఎం ఆదేశాలతో పనులు ముమ్మరం 

మోటార్ల రన్‌కు నీటి లభ్యతపై దృష్టి 

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరాయి. ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ పనులను క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించిన సీఎం కేసీఆర్‌ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. వర్షాలు రాకముందే పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఖరీఫ్‌కు నీరందించాలంటే అత్యంత కీలకమైన మేడిగడ్డ(కన్నెపల్లి) పంపుహౌస్‌లో మోటార్ల బిగింపులో వేగం పెంచి ఈ నెల చివర, జూన్‌ మొదటి వారంలోగా వెట్‌రన్‌ నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల ప్రతినిధులు పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఈ నెల 24 లేదా 25న వెట్‌రన్‌ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగించిన 8 మోటార్లలో 5 మోటార్లకు దశల వారీగా వెట్‌రన్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

నీటి తరలింపు 
కన్నెపల్లి పంపుహౌస్‌ నిర్మాణానికి దిగువన 400 మీటర్ల దూరంలో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. వెట్‌రన్‌ చేయడానికి వేసవి కాలం కావడంతో నీటి లభ్యత తక్కువగా ఉంది. గోదావరికి అడ్డంగా తాత్కాలికంగా కాఫర్‌ డ్యాంను 20 రోజుల క్రితం నిర్మించారు. ఆదివారం సీఎం పర్యటన ముగిశాక కాఫర్‌ డ్యాం కట్టను తెంపడంతో నీటి ప్రవాహం ఫోర్‌బేకు చేరింది. సోమవారం వరకు కాఫర్‌ డ్యాంకు మళ్లీ అప్రోచ్‌కెనాల్‌ వద్ద కట్టను మూసీ వేసి వెట్‌రన్‌ కోసం నీటిని నిల్వ ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  

రోజుకు 2 టీఎంసీలు 
కన్నెపల్లి పంపుహౌస్‌లో మొత్తం 11 మోటార్లు బిగించాలి. ఇప్పటికే 8 మోటార్లు బిగించగా, మరో 2 మోటార్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఖరీఫ్‌లో కనీసం 5 మోటార్లకు వెట్‌రన్‌ పరీక్షలు నిర్వహించి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా ఎగువకు తరలించడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు ఈఈ, డీఈఈ, జేఈఈలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పనుల ప్రగతిపై ఆరా తీస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top