ఐదుగురు రైతుల ఆత్మహత్య

Five farmers are suicide - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: పత్తి పంటకు తెగులు వచ్చి, పూత, కాత లేక దిగుబడి రావడంలేదు. దీంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని వేదనతో వేర్వేరు చోట్ల ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 
- ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం బలాన్‌పూర్‌లో కుమ్ర భావురావు(47) తనకున్న నాలుగెకరాల్లో పత్తి సాగు చేయగా మూడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది.  రూ.80 వేల బ్యాంకు అప్పు, ప్రైవేటు అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆవేదనతో గురువారం పురుగుల మందు తాగాడు.  

- నల్లగొండ జిల్లా చందంపేట మండలం గాగిళ్లాపురంలో సిగ పద్మ(34), ఇద్దయ్య దంపతులు ఐదెకరాల్లో పత్తి సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ. లక్ష అప్పు చేశారు. పంటదిగుబడి సరిగా రాలేదు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. దీనిపై దంపతుల మధ్య గురువారం వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో  మనస్తాపానికి గురైన పద్మ శుక్రవారం చేను వద్ద పురుగుల మందు తాగింది. 

- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం తూర్పుగూడెంలో కాల జైపాల్‌(37) 9 ఎకరాల్లో పత్తి సాగుచేశాడు.  ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంట  దెబ్బతింది. అప్పులభారం, దిగుబడి లేకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. 

- ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం పాలోడి  గ్రామంలో ఎర్రకుంటు సీతారామ్‌(40) ఏడెకరాల్లో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకులో రూ.50 వేలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.లక్ష అప్పు చేశాడు. పంటలకు తెగులు వచ్చి దిగుబడి రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక గురువారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు.  

- మహబూబాబాద్‌ జిల్లా  అమనగల్‌  శివారు గుండా లగడ్డ తండాలో భూక్యాలచ్చు(35) రెండున్నర ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల ఇల్లు కూడా కట్టుకోగా రూ.4 లక్షల అప్పు అయింది. పంట దిగుబడి తక్కువ రావడంతో అప్పుతీర్చే మార్గం కనిపించక శుక్రవారం పురుగులమందు తాగాడు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top