రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న కూలీల కొరత
వరి కోత యంత్రాలకు అధిక డిమాండ్
యంత్రాలతో తుక్కుగా మారుతున్న వరి గడ్డితో రైతుల ఆందోళన
గుర్రంకొండ : వరికోత వ్యవసాయ పనులు కొనసాగించడానికి కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరి పంట కోయడానికి కూలీల ఖర్చును భరించలేక పోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు వరికోత యంత్రాలకు ప్రా«ధాన్యత ఇస్తుండడంతో వాటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో వరికోత యంత్రాలకు ఒకగంటకు డిమాండ్‌ను బట్టి రూ. 3200 నుంచి రూ.3500 వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది.
అయితే వరికోత యంత్రాలతో పశుగ్రాసానికి పనికొచ్చే వరిగడ్డి తక్కుతుక్కుగా మారుతోంది. దీంతో వరిగడ్డిని కట్టలుగా కట్టుకోవడానికి అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.
14652 ఎకరాల్లో పంటసాగు
జిల్లాలో ఈసీజన్‌లో 14652ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో వరి కోత దశకు చేరుకొంది. దీంతో కోతలు, పంట నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కూలీల కొరతకారణంగా పలు రకాల వరికోత యంత్రాలు 45 వరకు జిల్లాలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. కొందరు కాంట్రాక్టర్లు తమిళనాడు నుంచి వీటిని జిల్లాకు తీసుకొచ్చి కాంట్రాక్టు పద్ధతిలో నడపుకొంటున్నారు.
ఎకరం పంటకు కూలీల ఖర్చు రూ.16వేలు
వరి పంట కోయడానికి కోతల దగ్గర నుంచి పంటల నూర్పిళ్లు వరకు కనీసం 15 నుంచి 20 మంది వరకు కూలీల అవసరం ఉంటుంది. ఒక్కో కూలీకి గరిష్టంగా రూ. 800 వరకు ప్రస్తుతం రైతులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఒక ఎకరం వరిపంట ఇంటికి చేరాలంటే రైతుకు రూ. 16 వేల వరకు ఖర్చు వస్తుంది.
అసలే వ్యవసాయరంగం కుదేలవుతున్న ఈ సమయంలో కూలీల కొరత రైతులను కుంగదీస్తోంది. దీంతో వరి సాగు కొనసాగించాలంటే పెట్టుబడులతో పాటు ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకోవాల్సిందేనని రైతుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వరికోతయంత్రాలో ఖర్చు ఆదా
ప్రస్తుతం పంట కాలంపూర్తి కావడంతో పాటు వరికోతలకు సమయం కూడా ముగిసిపోతుండడంతో ప్రత్యామ్నాయంగా వరికోత యంత్రాలను రైతులు వినియోగిస్తున్నారు. వరికోతయంత్రానికి గంటకు డిమాండ్‌ను బట్టి రూ. 3200 నుంచి రూ.3500 అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఒకఎకరం పంటలో వరికోతలు చేపట్టాలంటే ఒకటిన్న గంటల సమసయంలో యంత్రాలు పని ముగించేస్తాయి.
అంటే ఎకరం పంటకు రూ. 5250 మాత్రమే ఖర్చు వస్తుంది.అయితే వరికోత యంత్రాలతో కోతలు చేపడుతున్న రైతులకు వరిగడ్డి మాత్రం తుక్కుగా మరుతోంది. దీంతో గతంలో మాదిరి వరిగడ్డిని కట్టలు కట్టి వాములుగా భధ్రపరుచుకొనే అవకాశం లేకుండా పోతోంది. గతంలొ కూలీలతో వరిపంట కోతలు చేయిస్తే గడ్డిని మొదలు భాగం వరకు కోసి కట్టలు కట్టి కుప్పలు పోసి మళ్లీ పంట నూర్పిళ్లు కావించి గడ్డిని ఒక పద్ధతిలో కట్టలు కట్టేవారు.
అలా వరిగడ్డి కట్టల్ని కుప్పలు(వాములు)గా వేసుకునేవారు. నెలల తరబడి పాడిఆవులకు పశుగ్రాసంగా గడ్డిని వినియోగించుకొనే వారు. ప్రస్తుతం వరికోత యంత్రాలతో గడ్డి చిన్న ముక్కలుగా మారుతుండడంతో రైతులకు కష్టంగా మారుతోంది. దీంతో కొంతమంది పాడిరైతులు కష్టంగా ఉన్నా వరిపంటను కూలీలతో కోయించి గడ్డిబాగా వచ్చే పంటనూర్పిడి యంత్రాలతో నూర్పిళ్లు చేయించుకొంటున్నారు. దీంతో కొంతమేరకు గడ్డి పశుగ్రాసానికి పనికొస్తోందని రైతులు అంటున్నారు.
కూలీలకు డిమాండ్
ప్రస్తుతం గ్రామాల్లో కూలీలకు భలే డిమాండ్ ఏర్పడింది. వరి పంట కోతలకైతే కూలీల రేట్లు విపరీతంగా పెంచేశారు. వారు కోరిన మేరకు డబ్బులు ఇస్తామన్నా సమయానికి రావడంలేదు. ఓవైపు వరికోతల సమయం దాటిపోతోంది. మరోవైపు కూలీలు దొరక్క ఇబ్బంది పడాల్సి వస్తోంది.– ప్రభావతమ్మ, టి.రాచపల్లె దళితవాడ
యంత్రాలే నయం
వరికోతలకు కూలీల కంటే వరికోత యంత్రాలే ఎంతో నయంగా కనిపిస్తోంది. వరి కోతలకు, వడ్లు కుప్ప కొట్టేందుకు, వేర్వురుగా కాంట్రాక్ట్‌లు అడుగుతున్నారు. ఈవిధంగా చేస్తే రైతులకు తలకు మించిన భారం పడుతోంది. కూలీలకైతే రూ.20 వేలవరకు, యంత్రానికైతే రూ.6 వేల వరకు ఖర్చు వస్తోంది. యంత్రాలైతే కోత కోసి వడ్లు కూడా అప్పటికప్పుడు సంచులకు నింపుతాయి. దీంతో ఎంతో డబ్బు ఆదా అవుతోంది. – మన్నేరి శ్రీనివాసులు, టి.రాచపల్లె
పంటనూర్పిడి యంత్రాలతో గడ్డి బాగుంటుంది
వరికోతయంత్రాల కంటే పంటనూర్పిడి యంత్రాలతో వరిగడ్డి పశుగ్రాసంగా ఎక్కువగా పనికొస్తుంది. మొదటగా కూలీలతో పంటకోతలు పూర్తిచేశాం.తరువార పంటనూర్పిడి యంత్రాలను అద్దెకు తీసుకొచ్చి పంట నూర్పిడి చేయించాము. దీంతో గడ్డిబాగా వచ్చింది. కట్టలు కట్టుకొనేందకు ఎంతో సౌకర్యంగా ఉంది. – గెంటెం గోవిందు, కురవపల్లె
అన్నమయ్య జిల్లాలో వరి సాగు: 35654 ఎకరాలు
ఈ సీజన్‌లో పంట సాగు : 14652 ఎకరాలు
జిల్లాలో అందుబాటులో ఉన్న
వరికోత యంత్రాలు : 45
గంటకు వరికోతయంత్రాలకు చెల్లిస్తున్న ఆద్దె : రూ. 3200 నుంచి 3500


