గుడ్డునైనా వదలరు!

fishering in krishna water by banned fishing nets - Sakshi

అర్ధరాత్రి అలవి వలలతో కృష్ణానదిలో  వలస జాలర్ల చేపలవేట

అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు

చిన్నసైజు చేపపిల్లలను పట్టి విక్రయిస్తున్న మైనం

కలెక్టర్‌ ఫిర్యాదుచేసిన జిల్లా మత్స్యకారులు

మహబూబ్‌నగర్‌/వనపర్తి: జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత జాలర్లు నిషేధిత అలవి వలలతో  యథేచ్ఛగా చేపలవేట సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చేపలు పడుతూ మత్స్యసంపదను కొల్లగొడుతున్నారు. స్థానికంగా ఉండే కొందరు నాయకులు, అధికారులు వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.. తమకు దక్కాల్సిన మత్స్య సంపదను ఆంధ్రా జాలర్లు కొల్లగొడుతున్నారని జిల్లాకు చెందిన మత్స్యకార్మికులు స్వయంగా కలెక్టర్, అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి చిన్నంబావి మండలంలోని కృష్ణానది తీర ప్రాంతంలోని మత్స్యకారులు వలస జాలర్లు అలవి వలలతో పట్టిన చిన్న చిన్న చేపపిల్లలను తీసుకుని కలెక్టరేట్‌కు వచ్చారు.

ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కృష్ణానదిలో రూ.80లక్షల చేపపిల్లలను వదిలితే అవి పెరగకముందే  అలవి వలలతో పట్టి కార్పొరేట్‌ కంపెనీలకు విక్రయిస్తున్నారని కలెక్టర్‌ శ్వేతామహంతికి ఫిర్యాదు చేశారు. సుమారు 50మంది స్థానిక మత్స్యకారులు చేపపిల్లల సంచులతో కలెక్టరేట్‌కు వచ్చారు. రాత్రి సమయాల్లో మరబోట్లలో వచ్చి చేపల వేట సాగిస్తున్నారని ఇదివరకు రెండుసార్లు ఫిర్యాదుచేసినా ప్రయోజనం లేదని వారు వాపోయారు. జిల్లా మత్స్యశాఖ అధికారులకు సమాచారమిస్తే వెంటనే ఆంధ్రాప్రాంత జాలర్లకు తెలిసిపోతుందని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కొందరు గుంపు గుంపులుగా కృష్ణానదిలో చేపల వేట సాగించారని, వారి పట్టుకునేందుకు వెళ్తే పారిపోయారని చెప్పుకొచ్చారు. 

అనువైన ప్రాంతాలు 
జిల్లాలోని చెల్లెపాడు, వెల్టూరు, చిన్నమారూరు, పెద్దమారూరు, గడ్డబస్వాపురం, బెక్కెం, గూడెం తదితర ప్రాంతాల్లో నిత్యం అలవి వలలతో చేపల వేట కొనసాగుతోంది. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించి స్థానిక చెరువులతో పాటు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో 80లక్షల చేప పిల్లలను వదిలారు. అవి పెరిగితే నదీతీర ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలకు ఏడాది పొడవునా జీవనోపాధి లభిస్తుంది. కానీ ఆంధ్రా ప్రాంత జాలర్లు చేపలు అభివృద్ధి చెందకముందే దోమ తెరను తలపించే అలవి వలతో మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు. క్వింటాలు చేపలను రూ.12నుంచి రూ.15వరకు విక్రయిస్తున్నారు. 

అధికారులు పట్టించుకోడం లేదు.. 
చిన్నంబావి మండలంలోని కృష్ణాతీర ప్రాంతంలో ఆంధ్రా జలార్ల అలవి వేట నిత్యం కొనసాగుతుందని అధికారులకు ముందే తెలుసు. మేం వారు వేటకు వచ్చిన ప్రతిసారి సమాచారం ఇస్తూనే ఉన్నాం. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు.  
– మధు, వెల్టూరు, చిన్నంబావి మండలం 

కలెక్టర్‌ స్పందించాలి  
ఈ విషయంపై కలెక్టర్‌ సీరియస్‌గా స్పందించాలి. ఈ విషయంపై మూడవసారి ఫిర్యాదుచేశాం. నదీతీర ప్రాంతంలోని మత్స్య కార్మికులకు చెందాల్సిన మత్స్య సంపదను ఆంధ్రా ప్రాంత జాలర్ల నుంచి కాపాడాలి.  స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలి.  
– వాకిటి ఆంజనేయులు, మత్స్యకారుడు, చిన్నంబావి మండలం   

దాడులు నిర్వహిస్తాం   
కృష్ణానదిలో ఆంధ్రా జాలర్లు అలవి వలలతో చిన్న చేపలను కొల్లగొడుతున్నారని సోమవారం నాకు ఫిర్యాదు అందింది. దాడులు నిర్వహించేందుకు పోలీస్‌శాఖ సహకారం తీసుకునేందుకు ఏఎస్‌పీ సురేందర్‌రెడ్డిని కలిశాం. వారి సహకారంతో దాడులు చేసి అలవి వలలను సీజ్‌చేస్తాం.  
– రాధారోహిణీ, జిల్లా మత్స్యశాఖ అధికారి, వనపర్తి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top