చేపప్రసాదం.. భారీగా జనం

Fish Prasadam Distribution In Hyderabad - Sakshi

ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని

ఆస్తమా బాధితులతో కిక్కిరిసిన ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌

ఆదివారం సాయంత్రం ఆరింటి వరకు నిరంతర పంపిణీ

వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన జనం

ఉత్తరాది నుంచే అనూహ్య స్పందన

సాక్షి, హైదరాబాద్‌: ఆస్తమా బాధితులకోసం బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపప్రసాదం పంపిణీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే చేపప్రసాదంకోసం జనం భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆస్తమా వ్యాధిగ్రస్తులతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ కిటకిటలాడింది. శుక్రవారం రాత్రి నుంచే ఆస్తమా బాధితులు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ చేరుకున్నారు. ఈసారి మృగశిరకార్తె సాయంత్రం ప్రవేశించిన దృష్ట్యా చేపప్రసాదం పంపిణీ కూడా సాయంత్రం ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బత్తిన హరనాథ్‌గౌడ్, ఆయన కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు మంత్రి తలసాని ఆస్తమా వ్యాధి బాధితులకు చేపప్రసాదం అందజేసి పంపిణీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 173 ఏళ్లుగా, మూడు తరాలుగా బత్తిన సోదరులు చేపప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే చేప ప్రసాదం అనేది తెలంగాణలో పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. చేపప్రసాదం కోసం వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఆదివారం కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ కొనసాగనున్న దృష్ట్యా ప్రజలు ఓపిగ్గా వేచి ఉండాలన్నారు. ఆస్తమా బాధితులు ప్రతి ఒక్కరికీ చేపప్రసాదం లభించే విధంగా మందు తయారు చేసినట్లు బత్తిన హరనాథ్‌గౌడ్‌ తెలిపారు. అందరూ చేప ప్రసాదం తీసుకొనే వెళ్లాలన్నారు. ఆదివారం తరువాత మరో రెండు రోజులపాటు తమ ఇంటి వద్ద ప్రసాదం అందజేయనున్నట్లు తెలిపారు. తాము సూచించిన నియమాలకు అనుగుణంగా చేపప్రసాదం సేవిస్తే ఆస్తమా నయమవుతుందన్నారు. గత సంవత్సరం సుమారు 70 వేల మందికి పంపిణీ చేయగా ఈ ఏడాది ఆ సంఖ్య లక్షకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్తరాది నుంచే ఎక్కువ సంఖ్యలో.... 
జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు, హేతువాదులు, వైద్యనిపుణులు చేపప్రసాదం అశాస్త్రీయమని ప్రచారం చేస్తున్నప్పటికీ జనంలో ఆదరణ మాత్రం తగ్గడం లేదు. చేపప్రసాదం రూపంలో అందజేసే మందు కోసం వచ్చే బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచే జనం ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తదితర రాష్ట్రాల నుంచి  బాధితులు వచ్చారు. తప్పని పడిగాపులు...: ఇలా ఉండగా ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లు మాత్రం క్యూలైన్‌లలో ఎక్కువ సేపు నిలబడేందుకు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కూపన్‌ల కోసం క్యూలైన్‌లలో బారులు తీరారు. సాయంత్రం 6 గంటలకు పంపిణీ ప్రారంభమైంది. దీంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చి ంది. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

పత్యం పాటించాలి: బత్తిన సోదరులు 
చేప ప్రసాదం తీసుకున్న ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు కొన్ని సూచనలు చేశారు. వారు పత్యం పాటించాలన్నారు. మందు స్వీకరించిన తర్వాత గంటన్నరపాటు ఏమీ తినరాదన్నారు. మందును ఆరు మాత్రలుగా చేసి నీడలో 7 రోజులపాటు ఎండబెట్టాలన్నారు. వీటిని మూడు సార్లు 23 జూన్, జూలై 8, జూలై 23వ తేదీల్లో ఉదయం పరగడుపున ఒక మాత్ర, నిద్రబోయే ముందు ఒకటి గోరు వెచ్చటి నీటితో వేసుకోవాలి.45 రోజుల పాటు కింద పేర్కొన్న వస్తువులనే వాడాలి. పాత బియ్యం, గోధుమలు, చక్కెర, మేక మాంసం, చామకూర, పాలకూర, పులిచింత కూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వగరు, కోయికూర, అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, కందిపప్పు, కరడి ఆయిల్, మిరియాలు, మినప్పప్పు, మిరపపొడి, ఉప్పు, ఆవు నెయ్యి, మోసంబీలు (బత్తాయిపండ్లు), ఆన్‌జీర్‌ పండ్లు, ఆవుపాలతో చేసిన టీ, తెల్ల జొన్నలు, ఇడ్లీ (చట్నీ లేకుండా), బ్రెడ్‌ మాత్రమే తీసుకోవాలి.

స్నేహితుల సహకారంతో తెలుసుకున్నాను
స్థానిక ఆస్పత్రులు, పలు రకాల మూలికలు తీసుకున్నప్పటికి ఆస్తమా తగ్గలేదు. ఆస్తమా రోగులకు హైదరాబాద్‌ నగరంలో ప్రతి యేటా ఉచితంగా చేప ప్రసాదం అందిస్తారనే విషయాన్ని స్నేహితుడి ద్వారా తెలుసుకొని ఇక్కడకు వచ్చాను.  – దిలీప్, ఉత్తరప్రదేశ్‌

మొదటి సారిగా వచ్చాను 
గత రెండు సంవత్సరాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. ఉబ్బసం తగ్గేందుకు హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ చేస్తారన్న విషయం తెలుసుకొని రెండు రోజుల ముందే ఇక్కడికి వచ్చాను. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, అధికారుల ఏర్పాట్లు బాగున్నాయి. – భవానీ శంకర్, రాజస్థాన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top