పోలీస్‌ పోస్ట్‌.. ఏజు, ఫీజు ఎఫెక్ట్‌    | Financial burden for the poor students | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పోస్ట్‌.. ఏజు, ఫీజు ఎఫెక్ట్‌   

Jun 2 2018 9:10 AM | Updated on Mar 19 2019 9:03 PM

Financial burden for the poor students - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సిద్దిపేటటౌన్‌ : విద్యార్థుల బలిదానాలు, త్యాగాల పునాదుల మీద నిర్మితమైన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రం వస్తే లక్షకు పైగా ఉద్యోగాలు మన బిడ్డలకు వస్తాయని చెప్పిన మాటలు నమ్మిన వారి ఆశలు అడియాసలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం వచ్చాక 2015 డిసెంబర్‌ 31న ప్రభుత్వం 9 వేలకు పైగా పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తమ విలువైన సమయాన్ని కోల్పోయిన నిరుద్యోగులకు ఊరట కలిగించే విధంగా నిర్ణీత వయస్సులో కొంత సడలింపు నిచ్చింది ప్రభుత్వం. దీంతో కొంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాయి. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 18 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో అంతే మొత్తంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కనున్నాయి.

కానీ ప్రభుత్వం నిర్ణీత వయస్సులో సడలింపు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా మంది నష్టపోవాల్సి వస్తుంది. గత నోటిఫికేషన్‌లో భర్తీ చేసిన పోస్టుల కంటే ఈ సారి రెట్టింపు సంఖ్యలో భర్తీ చేయనున్న నేపథ్యంలో వయస్సు సడలింపు ఇస్తే ఎక్కువ మంది నిరుద్యోగులకు మేలు కలగనుంది. అలాగే, ఉద్యోగాలను విభాగాల వారీగా ప్రయారిటీ ఇచ్చి దరఖాస్తు చేసుకునే విధానానికి స్వస్తి చెప్పి కొత్తగా పోస్టు ప్రకారం ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.

దీని ప్రకారం ఒక్కో పోస్టుకు రూ.800 చెల్లించాల్సి వస్తుంది. మొత్తం 8 రకాల విభాగాలకు అభ్యర్థి దరఖాస్తు చేసుకోవాలంటే రూ.6400 చెల్లించాలి. ఇది పేద విద్యార్థులకు భారమే. గత నోటిఫికేషన్‌లో  కానిస్టేబుల్‌ పోస్టులకు అన్నింటికీ కలిపి రూ.400 అయ్యేవి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.200 ఫీజు చెల్లించేవారు.

స్పష్టత లేని నోటిఫికేషన్‌

వయసు, ఫీజు విషయంలో గతంలో మాదిరి అవకాశం ఇవ్వాలని ఉద్యోగార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ సమగ్రంగా లేదని, ఏ అంశంపై పూర్తి క్లారిటీ లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సివిల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఏఆర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే మొదట చెల్లించిన రూ.800 తోడు మరో రూ. 800 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

పెంచిన ఫీజులతో అభ్యర్థి ఏ జాబ్‌ అయితే తనకు వస్తుందని నమ్మకం ఉంటుందో ఆ జాబ్‌కే దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల స్పెషల్‌ ఫోర్స్‌ జాబ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి దానికంటే  మెరుగైన సివిల్‌ జాబ్‌కు కావాల్సిన మెరిట్‌ సాధించినా ఆ స్పెషల్‌ ఫోర్స్‌ జాబ్‌లోనే జాయిన్‌ కావాలి. దీనివల్ల అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుంది. వయోపరిమితి పెంచి, ఫీజులు తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

నిరుద్యోగులకు అన్యాయం

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వయోపరిమితి తగ్గించి నిరుద్యోగులకు అన్యాయం చేసింది. వయో పరిమితిలో సడలింపు ఇవ్వకుండా, మరోవైపు దరఖాస్తు రుసుం పెంచి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. ఈసారి ఉద్యోగం సాధించాలనే ఆశయంతో శిక్షణ తీసుకుంటున్నా. వయోపరిమితి పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. – సురేష్, నిరుద్యోగి

నిరుద్యోగులకు మేలు చేయాలి

చాలా కాలం తర్వాత విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వయోపరిమితి తగ్గించడంతో నాలాంటి చాలా మంది నిరుద్యోగులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఇన్ని రోజులు ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతున్నా. ప్రభుత్వం రిలీజ్‌ నోటిఫికేషన్‌ చూడగానే ఇన్ని రోజులు పడిన కష్టం వృథా అయ్యింది. ప్రభుత్వం నిరుద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలి. 

– వెంకటేష్‌ ప్రసాద్, నిరుద్యోగి

వయోపరిమితి పెంచాలి

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులకు అవకాశం లభించదు. దీనివల్ల డిగ్రీలు, పీజీలు చదివిన వారికి సరిపడా పోస్టులు ప్రభుత్వం విడుదల చేసే సరికి వారికి మరింత వయస్సు పెరిగి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కాకుండా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి వయోపరిమితి పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. 

– టి.రవి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఫీజులు తగ్గించాలి

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు ఫీజును పెంచడం సరికాదు. దీని వల్ల పేద విద్యార్థులు నష్టపోతారు. పెంచిన ఫీజులను తగ్గించకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం.    – శ్రీకాంత్,పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement