ఎదురుచూపులే..

Farmers Waiting For Rythu Bandhu Scheme Money Karimnagar - Sakshi

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ పూర్తి కావచ్చింది. నవంబర్‌ నుంచి యాసంగి సాగు పనులు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రెండవ విడత రైతుబంధు చెక్కుల పంపిణీని ఈ నెలలోనే చేపట్టాలని అంతా సిద్ధం చేసింది. అయితే ముందస్తు అసెంబ్లీఎన్నిల షెడ్యూల్‌ వెలువడడంతో కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు చెక్కుల పంపిణీకి నిలిపివేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు  జమ చేయాలని  ఆదేశించింది. దీంతో ఎకరాకు రూ.4వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వ్యవసాయ అధికారులు బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు.

రెండవ విడతలో మొత్తం అర్హులైన రైతులు 1,16,557 మందికి గాను రూ.166.80 కోట్లు వరకు అందాల్సి ఉంది. ఇప్పటివరకు 65,220 మంది ఖాతాల వివరాలు తీసుకోగా, ఇందులో 51,337 మంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో 13,400 మంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల వరకు నగదు పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఖాతాల వివరాలు సేరించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. మొదట ఈనెల 25వ తేదీ వరకు గడువు విధించగా, గత పదిహేను రోజులుగా మండల వ్యవసాయ కార్యాలయ వద్ద రైతుల సందడి నెలకొంది. పూర్తి స్థాయిలో రైతులు ఖాతా వివరాలు అందజేయకపోవడంతో మరో వారం రోజులు గడువు పెంచారు.

కోటపల్లి, తాండూర్, దండేపల్లి, జన్నారం మండలాల్లో 80 శాతం వివరాలు సేకరించారు. మిగతా మండలాల్లో 50 నుంచి 70 శాతం పూర్తయ్యింది. రైతుల ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా, వ్యవసాయ అధికారులు కార్యాలయాల్లో కూర్చొని పని కానిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడంతో రైతులు సమయానికి కార్యాలయాలకు వచ్చి వివరాలు అందించలేకపోతున్నారు. దీనికి తోడు సేకరించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో కొంత వరకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పెంచిన గడువులోగా అయినా పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల వివరాలు తీసుకుంటే నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది.

మొదటి విడత రైతులకే..

గత ఖరీఫ్‌లో రైతుబంధు చెక్కులు పొందిన రైతులకే రెండవ విడత యాసంగి పెట్టుబడి సాయం అందుతుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో రెండవ విడత చెక్కులు పంపిణీ చేయకుండా మొదటి విడత చెక్కులు తీసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఈ నెల 10వ తేదీ నుంచి రైతుల ఖాతాల వివరాలు సేకరణ పనిలో పడ్డారు. ఖాతాలో ఆప్‌లోడ్‌ అయిన కొద్ది రోజులకు రైతుల సెల్‌కు ఖాతాలో నగదు జమ అయినట్లు మెసేజ్‌ వస్తోంది. అయితే ఇప్పటివరకు సాయం పొందాల్సిన రైతులకు సంబంధించిన ఖాతాల దరఖాస్తులు 65 శాతం రాగా.. ఇందులో 52 శాతం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులు సహకరిస్తే పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం లేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. 

నెలాఖరు వరకు గడువు :  వీరయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
రైతుల వివరాల సేకణరకు తొలుత ఈ నెల 25వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వివరాల సేకరణలో ఆలస్యం కావడంతో గడువును నెలాఖరు వరకు పెంచడం జరిగింది. రైతులు ఆలస్యం చేయకుండా ఖాతాల వివరాలు అందజేస్తే సత్వరమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. ఇప్పటివరకు 80 వేల మంది రైతుల వరకు ఖాతాల వివరాలు సేకరించాం. ఇందులో 62వేల మంది రైతుల వివరాలను ఆన్‌లైన్లో ఆప్‌లోడ్‌ చేశాం. జిల్లాలో ఇప్పటివరకు రూ.14 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top