విద్యుత్ కోతలపై రైతుల కన్నెర్ర


 నిర్మల్(మామడ) : విద్యుత్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. కోత లు, రాత్రి వేళ సరఫరాను నిరసిస్తూ మామడ మండలం పొన్కల్ గ్రామంలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. గ్రామానికి వచ్చిన విద్యుత్ సిబ్బందిని స్థానికు లు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.



ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. వ్యవసాయ పెంపుసెట్లకు డీ గ్రూపులో విద్యుత్ సరఫరా అవుతుండగా ఉదయం 8నుంచి 10గంటల వరకు, రాత్రి 10నుంచి ఒంటిగంట వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం పంట చేనులోకి వెళ్లిన రైతులు విద్యుత్ సరఫరా లేకపోవడంతో సబ్‌స్టేషన్‌కు వచ్చారు. సమయం మారిందని మధ్యాహ్నం 2నుంచి 4గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు తెలపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



 విద్యుత్ సిబ్బందిని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. రాత్రి వేళ కాకుండా మధ్యాహ్నం విద్యుత్ సరఫరా చేస్తూ అంతరాయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ గ్రామానికి వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ చంద్రమౌళిని సంప్రందించగా వ్యవసాయ పెంపుసెట్లకు డీ గ్రూపులో విద్యుత్ సరఫరా వేళ లు మారాయని పేర్కొన్నారు.



 రోడ్డుపై బైఠాయించి నిరసన..

 కుంటాల : విద్యుత్ కోతలను నిరసిస్తూ మండలంలోని ఓలా గ్రామానికి చె ందిన రైతులు ఆదివారం కుంటాల 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఓలా ఫీడర్ శనివారం మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు, ఆదివారం ఉదయం 4నుంచి 9గ ంటల వరకు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కుంటాల సబ్‌స్టేషన్‌ను ముట్టడించి గంటపాటు రోడ్డుపై బైఠాయించారు.



వారు మాట్లాడుతూ వర్షాలు లేక కరెంట్‌ను నమ్ముకుని బోరుబావులకింద వరి సాగు చేస్తే కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సోయా పంటలు వాడుతున్నాయని వాపోయారు. రైతులు ఏఈ శంకర్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా ఏఈ స్పందిస్తూ సబ్‌స్టేషన్‌లో అధిక భారం పడడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. సమస్య పరిష్కరించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.



 సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా..

 సిర్పూర్(టి) : సిర్పూర్(టి) గ్రామపంచాయతీ పరిధి బెంగాలీ క్యాంప్, పాతట్లగూడ, షేక్‌అహ్మద్‌గూడ, శివపూర్ గ్రామాలకు విధించే విద్యుత్ కోతల సమయాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ లక్ష్మీపూర్, బెంగాలీక్యాంపు గ్రామాల పరిధిలోని వ్యవసాయ పంపుసెట్లకు రాత్రివేళ మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, దీంతో ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు.



పంచాయతీ పరిధిలోని పాతట్లగూడ, షేక్ అహ్మద్‌గూడ, శివపూర్ గ్రామాలకు విద్యుత్‌ను హీరాపూర్ ఫ్లీడర్ తో సరఫరా చేస్తున్నారని, దీనిని రద్దు చేసి సిర్పూర్ పంచాయతీ నుంచి విద్యుత్ సరఫరా చేయాలని వారు కోరారు. ఈ విషయమై మండల అధ్యక్షురాలు నీరటి రేఖ, సర్పంచ్ కిజర్‌హుస్సేన్, ఉపసర్పంచ్ తోట మహేశ్‌లకు ఫిర్యాదు చేయగా సబ్‌స్టేషన్‌కు చేరుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ కోతల సమయాన్ని మార్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top