తల రాత మార్చే చేతి రాత

Famous handwriting expert Ejaz Ahmad Calligraphy - Sakshi

దుబ్బాక : అందమైన చేతి రాత విద్యార్థుల క్రమశిక్షణకు గీటురాయిగా నిలుస్తుందని, చదువులో ఏకాగ్రత పెరుగుతుందని ప్రముఖ చేతిరాత నిపుణుడు ఎజాజ్‌ అహ్మద్‌ అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని గాయత్రీ విద్యాలయం విద్యార్థులకు చేతిరాతపై అవగాహన కల్పించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో చేతి రాత ప్రాధాన్యం.. సులువుగా నేర్చుకునే మెలకువలను నేర్పారు. గజిబిజి రాత బాగుపడేలా విద్యార్థులకు దిశా నిర్ధేశం చేశారు.

తరగతి గదిలో డల్‌గా ఉండే విద్యార్థులకు చేతిరాతపై అభిరుచిని చూపిస్తే తనకు తానే ఉత్తమ విద్యార్థిగా మారడం ఖాయమన్నారు. అందమైన చేతిరాతతో విద్యార్థుల తల రాత మారడమే కాకుండా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు.

చేతిరాత బాగున్న విద్యార్థుల్లో ఓపిక, సహనం పెరుగుతాయని, విద్యార్థినులు మెహందీ, ముగ్గుల డిజైన్లు వేయడంలో నిష్ణాతులవుతారని పేర్కొన్నారు. అక్షరాలను దిద్దించే ప్రయత్నం చేయకపోవడంతో రాత మొక్కుబడిగా మారుతోందన్నారు.

ఇలాంటి తరుణంలో విద్యార్థులను అక్షర శిల్పులుగా తీర్చిదిద్దే సాధనానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఇంత సులువుగా తెలుగు, ఇంగ్లిష్, హిందీలో రాయవచ్చా అని విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top