ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

Excavations For Treasure Hunt In Temple At Amrabad - Sakshi

సాక్షి, అమ్రాబాద్‌: పదర మండలం రాయలగండి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ఎదుట ఉన్న అగ్నిగుండాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. అగ్ని గుండం కోసం పేర్చిన రాళ్లను తొలగించి, తవ్వకాలు జరిపి యథాస్థానంలో ఉంచారు. బుధవారం ఉదయం స్థానికంగా ఉన్న భక్తులు కొంత మంది చూసి తవ్వకాలు జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పదర ఎస్‌ఐ సురేష్‌కుమార్‌  సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న వారిని విచారించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ తెలిపారు. 

గతంలోనూ తవ్వకాల ప్రయత్నం

ఆలయంలో తవ్వకాలు జరిపిన ప్రదేశం

ఇదిలాఉండగా గత ఆగస్టు 10వ తేదీన రాయలగండిలో గుప్త నిధుల తవ్వకాల ప్రయత్నం జరిగింది. ఓ కారులో గుప్తనిధుల కోసం రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో పరికరాలతో అణ్వేషన జరుపుతుండగా స్థానికులు గుర్తించి వెంబడించారు. కారులో పరారైన దుండగులను మన్ననూర్‌లో ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వచ్చిన ఐదు మంది దుండగులతో పాటు కారును, గుప్తనిధుల అన్వేషణకు తెచ్చుకున్న డిటోనేటర్, పౌడర్, వివిధ పరికరాలను స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశారు. అప్పట్లో అన్వేషణ ప్రయత్నం జరగడం, బుధవారం తవ్వకాలు బయట పడటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాయలగండి ఆలయం వద్ద పోలీసు పహారా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top