ఇక ఇంగ్లిష్‌ ప్రైమరీ స్కూళ్లు | Establishment of elementary school in English medium | Sakshi
Sakshi News home page

ఇక ఇంగ్లిష్‌ ప్రైమరీ స్కూళ్లు

Jul 21 2017 1:50 AM | Updated on Sep 5 2017 4:29 PM

ఇక ఇంగ్లిష్‌ ప్రైమరీ స్కూళ్లు

ఇక ఇంగ్లిష్‌ ప్రైమరీ స్కూళ్లు

సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో వాటి స్థానంలో కొత్తగా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఏర్పాటుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు
పిల్లల సంఖ్య తగ్గుతున్న ‘సంక్షేమ’ గృహాలు పాఠశాలలుగా మార్పు
49 స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: కేజీ టు పీజీ కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ.. తాజాగా ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో వాటి స్థానంలో కొత్తగా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాన్‌ రెసిడెన్షియల్‌ పద్ధతిలో వాటిని నిర్వహించాలని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. తొలుత ప్రయోగ పద్ధతిలో కనిష్టంగా జిల్లాకు ఒకటి చొప్పున, ప్రాధాన్యత క్రమంలో స్కూళ్లు ప్రారంభించేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 49 స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఎస్సీ అభివృద్ధి శాఖ.. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదించింది. ప్రయోగం ఫలిస్తే వచ్చే ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. స్కూళ్ల విషయమై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభించనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

40 మందిలోపు విద్యార్థులుంటే..
నలభై కన్నా తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎంపిక చేసిన అధికారులు.. మౌళిక వసతుల ఆధారంగా ఆంగ్ల మాధ్యమం నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తొలిదశ నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన విద్యార్థులు చురుకుగా ఉన్నట్లు సర్వేల్లో వెల్లడి కావడంతో ప్రాథమిక ఆంగ్ల పాఠశాలల ఏర్పాటుకు ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయంతీసుకుంది.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 49 హాస్టళ్లను గుర్తించి స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో టీచర్లను నియమించి బోధన చేపట్టాలని, వాటి నిర్వహణను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వసతి గృహ సిబ్బందిని కొరత ఉన్న హాస్టళ్లకు బదిలీ చేయనుంది. జిల్లా కేంద్రాల్లో ఇంగ్లిష్‌ మీడియంప్రైమరీ స్కూళ్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, స్కూళ్లలోని 70 శాతం సీట్లను ఎస్సీ విద్యార్థులకే కేటాయించనున్నట్లు ఆ శాఖ సంచాలకులు కరుణాకర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement