ఐఎంఎస్‌ స్కాంలో మరొకరు అరెస్టు

ESI Medicine Scam Another Person Arrested - Sakshi

బెదిరింపుల కేసులో సురేంద్రనాథ్‌ని అరెస్టు చేసిన ఏసీబీ

సాక్షి, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌)లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు కీలక వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. సోమవారం ముదిమెల సురేంద్రనాథ్‌ బాబును అరెస్టు చేశారు. తొలి నుంచి ఈ కేసులో డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మల తర్వాత వెలుగులోకి వచి్చన పేరు సీనియర్‌ అసిస్టెంట్‌ సురేంద్రనాథ్‌దే. సురేంద్రనాథ్‌ని అరెస్టు చేస్తామని ఆదివారం ఉదయమే ఏసీబీ అధికారులు ప్రకటించారు. గతంలో పఠాన్‌చెరుకు చెందిన ఇన్‌చార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్‌కు ఫోన్‌ చేసి ఖాళీ బిల్లులపై సంతకాలు చేయాలని బెదిరించిన కేసులో పోలీసులు వీరిపై ఐపీసీ 120–బీ, 109 ఆర్‌/డబ్ల్యూ, 34, 12, 13లలో పలు ఉప సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ బెదిరింపుల ఘటనకు సంబంధించి ఆడియో టేపులు మీడియాకు లీకైన విషయం తెలిసిందే.

నిబంధనలకు విరుద్ధంగా.. 
ఈ కేసులో ఏ–1గా ఉన్న ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మలకు రామచంద్రాపురం డిస్పెన్సరీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సురేంద్రనాథ్‌ బాబే ఈ స్కాంలో కీలకం గా వ్యవహరించాడు. వీరి వ్యవహారాలన్నీ అతడే చక్కబెడుతుండేవాడు. నకిలీ ఇండెంట్లు, వాటిపై ఫార్మాసిస్టులు, వైద్యుల సంతకాలు పెట్టించడంలో చురుగ్గా వ్యవహరించేవాడు. దీంతో సురేంద్రని నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర కార్యాలయంలో విధుల్లోకి ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి తీసుకొచ్చారు. వాస్తవానికి అలా చేయాలంటే డిప్యుటేషన్, బదిలీ అయినా జరగాలి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. ఏకంగా డైరెక్టర్‌ అతన్ని ఇక్కడి కి రప్పించడంతో ఈ వ్యవహారం తెలిసినా ఎవరూ కిమ్మనలేదు. ఇటు సురేంద్రనాథ్‌ ఐఎంఎస్‌ కార్యాలయానికి వచ్చాక నకిలీ, ఖాళీ, ముందు తేదీలతో వేసిన బిల్లులపై సంతకాలు చేయాలని పలు డిస్పెన్సరీలకు చెందిన వైద్యులు, ఫార్మాసిస్టులను బెదిరించాడు. ఇటీవల ఆ ఆడియో టేపులు బయటికొచ్చాయి. ఈఎస్‌ఐలో వెలుగుచూసిన భారీ కుంభకోణంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల ని సీపీఎం హైదరాబాద్‌ నగర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ కుంభకోణంలో లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top