మా బస్తీల పరిస్థితి ఏంటి?

Erramanzil Colony People Protest on Assembly Construction - Sakshi

ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణానికి సీఎం ప్రతిపాదన

రామకృష్ణానగర్, తబేళాబస్తీలకు ఎఫెక్ట్‌  

ఆందోళన చెందుతున్న స్థానిక బస్తీ ప్రజలు  

పంజగుట్ట: ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఇది జరిగినప్పటి నుంచి స్థానిక బస్తీల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు. ఎర్రమంజిల్‌ పక్కనే ఉన్న రామకృష్ణానగర్, తబేళాబస్తీ వాసులు తమ ఇళ్లు ఇక్కడి నుంచి తొలగిస్తారని, మరోచోట డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తారన్న పుకారు పుట్టడంతో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. తాము అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లకుండా ఉండేందుకు ఇప్పటికే పార్టీలకు అతీతంగా ఐక్యమై ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. రెండు కాలనీలకు దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉంది. రామకృష్ణానగర్‌ గుట్టపైన ఉంది. పక్కనే అసెంబ్లీ నిర్మిస్తే రక్షణ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపధ్యంలో కాలనీని తొలగించే అవకాశం ఉండగా, తబేళాబస్తీ కూడా ప్రస్తుతం అసెంబ్లీ నిర్మించే ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో దాన్ని కూడా తొలగిస్తారనే పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ఎర్రమంజిల్‌ క్వార్టర్స్‌ చాలామటుకు నిమ్స్‌ స్వాధీనం చేసుకుని అక్కడ నెఫ్రాలజీ, న్యూరాలజీ టవర్‌లు కట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ వస్తే ఎత్తయిన టవర్లకు కూడా అనుమతి ఇస్తారా.. లేదా..? అన్నదానిపై ప్రస్తుతం సందేహం నెలకొంది.  

నివాసితులతో స్థానిక నేత మంతనాలు
స్థానిక ప్రజా ప్రతినిధి ఇప్పటికే రామకృష్ణానగర్‌ బస్తీ వాసులకు పార్టీలతో సంబంధం లేకుండా గ్రూపులుగా పిలిపించుకుని మాట్లాడుతున్నట్లు సమాచారం. డబుల్‌ బెడ్రూం ఇళ్లకు అనుకూలంగా ఉన్న వారికి, వ్యతిరేకంగా ఉన్న వారి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కాగా వారికి అనుకూలంగా ఉన్నవారు కొంతమంది వెళుతుండగా, మరి కొంతమంది చర్చలకు వెళ్లడంలేదని తెలిసింది. ఒకవేళ ఈ రెండు బస్తీలను తొలగిస్తే రామకృష్ణానగర్‌లో సుమారు 300 కుటుంబాలు, తబేళాబస్తీలో 120 కుటుంబాల వరకు రోడ్డున పడ్డం ఖాయం. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పటికే సుమారు రెండు వేలమంది వరకు దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే రోడ్లలో అసెంబ్లీ నిర్మిస్తే మంరిత ట్రాఫిక్‌ సమస్య తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఖైరతాబాద్‌ నుంచి అమీర్‌పేట వరకు ఎప్పుడూ ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఎర్రమంజిల్, నిమ్స్‌ వద్ద ఈ సమస్య ఇంకా అధికం. దీనికితోడు సమీపంలోనే అసెంబ్లీ నిర్మిస్తే ఏ విధంగానూ అనువైంది కాదని ఇక్కడి వారు చెబుతున్నారు. అన్నింటికీ ఇబ్బందికరంగా ఉన్న ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణాన్ని తాము అంగీకరించమని స్థానిక బస్తీల ప్రజలు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top